ఈ-మెయిల్… ఈ పేరు వినని వారు బహుశా ఎవరూ ఉండరు. కంప్యూటర్లు వాడుతున్న వారందరికీ, ఆ మాటకొస్తే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ-మెయిల్ గురించి తెలుసు. అయితే దాన్ని మొదట ఎవరు క్రియేట్ చేశారో తెలుసా? ఏముందీ ఎవరో ఇంగ్లిష్ పెద్దమనిషి అయి ఉంటాడులే అనబోతున్నారా? కానీ వారు మాత్రం కాదు. ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది సాక్షాత్తూ మన భారతీయ యువకుడే. అతనిది తమిళనాడు రాష్ట్రం.
తమిళనాడులో జన్మించిన వీఏ శివ అయ్యదురై తన 7వ ఏట అనగా 1978లో తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లాడు. అక్కడే తండ్రి స్థిర పడడంతో శివ చదువు కూడా అమెరికాలోనే సాగింది. కాగా అతను 14 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు న్యూ జెర్సీలోని లివింగ్‌స్టన్ హైస్కూల్‌లో విద్యను అభ్యసిస్తుండేవాడు. ఈ క్రమంలో ఒక రోజు అతను తన స్కూల్‌లో ఉన్న ఆఫీస్‌లో పలువురు ఉద్యోగులు డెస్క్‌లపై పని చేయడం చూశాడు. ఒక్కో ఉద్యోగికి ప్రత్యేకంగా ఒక టేబుల్, దానిపై ఒక టైప్ రైటర్, ఇన్‌కమింగ్ లెటర్స్ కోసం ఒక బాక్స్, ఔట్ గోయింగ్ లెటర్స్ కోసం ఒక బాక్స్, పలు రకాల ఫైల్స్, కార్బన్ కాపీ పేపర్, డ్రాఫ్ట్‌లు, అడ్రస్ బుక్‌లు, పేపర్ క్లిప్స్ ఉండేవి. వాటన్నింటిని శివ రోజూ గమనిస్తూ ఉండే వాడు. దీంతో అతని బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. అదే అతన్ని ఈ-మెయిల్ క్రియేట్ చేసేలా చేసింది.
నిత్యం ఆఫీస్‌లో శివ గమనించిన వాటినే ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకురావాలనుకున్నాడు. అందుకోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సహాయంతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో దాదాపు 50వేల లైన్లు కలిగిన ఓ కోడ్‌ను రాశాడు. దీంతో 1982, ఆగస్టు 30న మొట్ట మొదటి ఇంటర్ ఆఫీస్ మెయిల్ సిస్టమ్‌ను అతను క్రియేట్ చేశాడు. దాన్నే ఈ-మెయిల్ కింద పరిగణించారు. అనంతరం కొద్ది రోజులకు అమెరికా కాపీరైట్స్ రిజిస్ట్రేషన్స్ వారు ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసినందుకు గాను శివకు పేటెంట్ రైట్స్‌తో కూడిన ఓ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. అలా ఈ-మెయిల్‌ను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయుడేనన్న విషయం తరువాత ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇప్పటికీ చాలా మందికి ఈ-మెయిల్‌ను కనుగొన్నది ఎవరో తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా. ఇంకేం, అతను భారతీయుడు అయినందుకు నిజంగా మనం అందరం గర్వించాలి. అతను చేసిన పనిని, చేపట్టిన ఆవిష్కరణకు ఎల్లప్పుడూ మనం అతన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. ఏమంటారు, అంతేకదా!