ఒకసారి రణజిత్ సింగ్ మహారాజు ఎక్కడికో వెళుతున్నారు. ఇంతలో ఒక రాయి వచ్చి ఆయనకు తగిలింది. సైనికులు నాలుగువైపులా పరికించి చూడగా ఒక వృద్ధురాలు కనబడింది. సైనికులామెను బంధించి రాజుగారి దగ్గరకు తీసుకొని వచ్చారు. వృద్ధురాలు రాజు గారిని చూస్తూనే భయంతో వణికి పోయింది.
ప్రభూ! నా పిల్లవాడు నిన్నటి నుండి ఆకలితో ఉన్నాడు. ఇంట్లో తినడానికేమీ లేదు. అందుకే చెట్టు మీదకు రాళ్ళు విసురుతున్నాను. కనీసం కొన్ని రేగుపండ్లు రాలితే అవి తీసుకొని వెళ్ళి అతడికి తినిపించాలి అని! పొరపాటుగా అందులో ఒక రాయి వచ్చి తమరికి తగిలింది. నేను నిరపరాధిని. ప్రభూ! నన్ను క్షమించండి అని అన్నది.
మహారాజు కొంతసేపు ఆలోచించి, తరువాత సైనికులతో ఈ వృద్ధురాలికి ధనమిచ్చి సగౌరవంగా సాగనంపండి అన్నాడు. ఇది విని ఉద్యోగులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చివరికి ఒకరు అడిగేశారు కూడా మహారాజా! దండించవలసిన మనిషికి డబ్బిచ్చి పంపడమా? అని.కదలలేని ఒక చెట్టే రాయి తగిలితే బదులుగా తియ్యటి పండ్లు ఇచ్చినప్పుడు పంజాబ్‌కు మహారాజునైన నేను ఆమెను ఖాళీ చేతులతో ఎలా పంపేయగలను? అని రంజిత్ సింగ్ అన్నారు.