ఇంజినీరింగ్ సంబంధిత డిగ్రీల విషయానికి వస్తే దేశంలో మనకు చేసేందుకు రెండు రకాల డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలు లేదా కాలేజీలు బీఈ కోర్సులను ఆఫర్ చేస్తే కొన్ని బీటెక్ కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని ఇనిస్టిట్యూట్‌లలో బీఈ, బీటెక్ రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంజినీరింగ్‌లో ఉన్న ఈ రెండు డిగ్రీలను చూసి సాధారణంగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండు డిగ్రీలు ఇంజినీరింగ్‌వే అయితే మరి రెండు డిగ్రీలను వేర్వేరుగా ఎందుకు అందిస్తున్నారు..? అసలు బీఈ కోర్సుకి, బీటెక్ కోర్సుకి మధ్య తేడాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ అని, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని చాలా మందికి తెలుసు. అయితే బీఈ చదివే వారికి థియరీ నాలెడ్జ్‌కు చెందిన సబ్జెక్టులను ఎక్కువగా బోధిస్తారు. బీఈ కోర్సులో ప్రాక్టికల్ కంటే థియరీని ఎక్కువగా చెప్తారు. బీఈ కోర్సుల్లో సిలబస్ జనరల్‌గా చాలా అరుదుగా మారుతుంది. ఇక బీటెక్‌లో థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను ఎక్కువగా బోధిస్తారు. ఆయా అంశాల పట్ల టెక్నికల్ గా అవగాహన ఎక్కువగా కల్పిస్తారు. ఇలా ఈ రెండు డిగ్రీల మధ్య తేడాలు ఉంటాయి. అయితే బీటెక్ డిగ్రీ సిలబస్ తరచూ మారుతుంటుంది.
ఇక బీఈ లేదా బీటెక్ ఏది చదివినా సరే ఇంజినీరింగ్ పూర్తి చేశాడనే అంటారు. రెండూ సమాన డిగ్రీలే. రెండింటిలోనూ 8 సెమిస్టర్లు ఉంటాయి. అయితే బీఈ లేదా బీటెక్.. అనేది మంచి ఇనిస్టిట్యూట్‌లో చదివితే శాలరీ ప్యాకేజ్ అద్భుతంగా ఉంటుంది. బిట్స్ పిలానీ, ఐఐటీ వంటి ఇనిస్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ఫారిన్ కంపెనీలు లక్షల రూపాయల ప్యాకేజీలతో ఎగరేసుకుపోతుంటాయి. ఈమధ్యే ప్రయాగ్‌రాజ్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదివిన ఓ స్టూడెంట్‌కు న్యూయార్క్‌కు చెందిన ఓ కంపెనీ ఏకంగా రూ.1.02 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంది. అలాగే మరో 6 మంది విద్యార్థులకు రూ.85 లక్షల చొప్పున ప్యాకేజీలను ఇచ్చి పలు కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ చేశాయి. ఇలా మంచి ఇనిస్టిట్యూట్‌లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేస్తే మంచి జాబ్ సాధించవచ్చు.