ఆడైనా, మగైనా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నంత వరకు అంతా హ్యాపీగానే ఉంటుంది. అలా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు కూడా. ఫ్రెండ్స్‌తో తిరగడం, పార్టీలు, పబ్‌లు, టూర్లు వేయడం… ఇలా చాలా మంది రక రకాలుగా ఆ సమయంలో ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్కసారి పెళ్లి అయితే మాత్రం ఇక ఎవరు అనుకున్నా, అనుకోకపోయినా దాదాపుగా ఇలాంటి సరదాలన్నీ బంద్ అయిపోతాయి. ఈ క్రమంలో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో రోజంతా ఆఫీసులో పని చేసి ఇంటికి వచ్చాక ఇక జీవిత భాగస్వామితో గడిపేందుకు సమయం కూడా దొరకదు. కొన్ని సందర్భాల్లోనైతే ఒకరినొకరు పట్టించుకోరు కూడా. కానీ దంపతులు ఇలా గడపడం మంచిది కాదట. వారి జీవితం సుఖమయంగా ఉండాలన్నా, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సాఫీగా లైఫ్ గడవాలన్నా అందుకు కొన్ని సూచనలు పాటించమని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ సూచనలు ఏమిటంటే…
దంపతుల్లో ఏ ఒక్కరు లేదా ఇద్దరికీ ఇద్దరు జాబ్ చేసినా సాయంత్రం ఇంటికి రాగనే తమ భాగస్వామిని ఆత్మీయంగా ఒకసారి పలకరించాలట. అంతేకానీ వారిని పట్టించుకోకుండా ఉండకూడదట. అలా పలకరించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యం పెరుగుతుందట. రోజంతా ఆఫీసులో ఎదుర్కొన్న ఒత్తిడి కూడా మాయమవుతుందట. ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఆఫీసు విషయాలను వదిలేసి ఇంటి గురించి, జీవిత భాగస్వామి గురించి కొద్ది సేపు ఆలోచించాలట. దీంతో మిమ్మల్ని ఇంటి వద్ద ఉన్న వారు ఎంత ప్రేమిస్తున్నారో, వారు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. నిత్యం ఆఫీసు పనులతో సతమతమవుతున్నా, అప్పుడప్పుడూ సరదాగా బయట తిరిగి రావాలట. ఏదైనా పార్క్ లేదా సినిమాకో, రెస్టారెంట్‌కో వెళ్లి ఎంజాయ్ చేసి రావాలట. చాలా మంది దంపతులు తమ జీవిత భాగస్వామితో లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇష్ట పడతారట. ఈ క్రమంలో ఇతరులు ఎవరైనా ఇంట్లోకి వచ్చి డిస్టర్బ్ చేయకుండా రూమ్ తలుపులు అన్నీ పెట్టుకుని లైఫ్‌ను ఎంజాయ్ చేయాలట. అంతా ఓపెన్‌గా ఉంచకూడదట. అలా ఉంటే కొందరు దంపతులకు నచ్చదట.
శరీరం నుంచి దుర్వాసన రావడం, వెనుక నుంచి గ్యాస్ రావడం వంటి వన్నీ ప్రకృతి సహజ సిద్ధమైన క్రియలు. ఇవి ప్రతి మనిషికీ సహజమే. అయితే అవి వచ్చినప్పుడు దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలట. అంతే కానీ అలా దుర్వాసన వస్తుందని వారిని పక్కకు పెట్టకూడదట. ఇంట్లో ఏ పని చేసినా సాధారణంగా ఆడవారే చేస్తారు. మగవారు చేయరు. కూరగాయలు కోయడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులను ఆడవారితో పాలు పంచుకుంటే అప్పుడు ఆ దంపతుల జీవితం హ్యాపీగా ఉంటుందట. చాలా మంది స్త్రీ, పురుషులు పెళ్లి కాగానే కొద్ది రోజులకు లేదా నెలలకు తమ తమ హాబీలను, ఇష్టాలను వదిలేస్తారట. కానీ అలా చేయాల్సిన అవసరం లేదట. జీవిత భాగస్వామితో సర్దుకుని పోతూ సదరు ఇష్టాలను పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదట. దంపతులన్నాక ఇద్దరి మధ్య కఠినమైన సందర్భాలు వస్తుంటాయి. అలాంటి వేళల్లో సాధ్యమైనంత వరకు మరీ అంత తీవ్రంగా మనోభావాలను వ్యక్తపరచడమో, లేదంటే పదాలను పలకడమో చేయకూడదట. అలా చేస్తే ఎదుటి వారికి జీవిత భాగస్వామి పట్ల అయిష్టత ఏర్పడుతుందట.
దంపతుల్లో ఇరువురూ తమ ఇద్దరి తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాన గౌరవం ఇవ్వాలట. దీంతో జీవిత భాగస్వామిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందట. బాగా ఎక్కువ గదులున్న ఇళ్లను కలిగి ఉన్న దంపతులు ఎల్లప్పుడూ ఒకే గదిలో కాకుండా ఇద్దరు కొంత సేపు వేర్వేరుగా వేరే వేరే గదుల్లో గడిపితే దాంతో థ్రిల్లింగ్‌గా ఉంటుందట. దంపతులిద్దరూ తమ సంబంధంలో ఏవేవి కోల్పోతున్నారో, ఏవేవి గ్రహిస్తున్నారో ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండాలట. దీంతో వారి జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేందుకు వీలు కలుగుతుందట.