Toothbrush : పొద్దున లేవగానే మనం పళ్లు తోముకుంటాం. కానీ ఎలా తోముకుంటాం. బ్రష్ తీయడం.. పైన పేస్టు పెట్టడం.. నోట్లో పెట్టి నాలుగుసార్లు ఇటూ అటూ పళ్ల మీద రుద్దడం ఇలాగేనా..? ప్రతి వస్తువుకు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే మనం వాడే టూత్ బ్రష్ కు కూడా. పళ్లు తోముకోవడం గురించి మన టూత్ బ్రష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. బ్రష్ ను ఎన్ని నెలలకొకసారి మారుస్తున్నారు. ఒక బ్రష్ జీవితకాలం కేవలం రెండు నెలలు లేదా 200 సార్లు వాడడం మాత్రమే. కానీ ఒకే టూత్ బ్రష్ ను కొందరు నెలకు నెలలు వాడేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా ఏడాది దాటి మరీ వాడుతుంటారు. కనుక ప్రతి రెండు నెలకు ఒకసారి బ్రష్ ను మారుస్తుండాలి.
రోజూ మీరెంతసేపు బ్రష్ చేస్తారు ? కొందరు పళ్లు అరిగిపోయేలా తోమేస్తుంటారు. మరికొంకదరు అటు ఇటు తోమేసి హడావిడిగా ముగించేస్తారు. కనీసం రెండు నిమిషాలైనా తోమాలని చెబుతున్నారు నిపుణులు. నోరు శుభ్రపడాలంటే రెండు నిమిషాల కన్నా తక్కువ కాకుండా బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన వెంటనే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేస్తుంటాం. నోరు శుభ్రంగా కడుక్కుని వచ్చేస్తాం. కానీ బ్రష్ చేశాక ఆ నురగ అంతా ఉమ్మేశాక ఓ అరగంట పాటు నీటితో కడగకుండా అలాగే ఉండాలట. అనంతరం నోట్లో నీళ్లు వేసి పుక్కిలించాలట. అరగంట పాటా అని కష్టపడకండీ. మనకు మంచి చేసే ప్రతిదీ కష్టంగానే ఉంటుంది.
బ్రషింగ్ అయ్యాక బ్రష్‌ను బాత్ రూంలో ఒక మూల పడేసి మిగతా పనులు కానిచ్చేస్తుంటారు చాలామంది. కానీ కనిపించని ఎన్నో క్రిములు చేరతాయి. కాబట్టి బ్రష్ ను విడిగా స్టాండ్ లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. హార్డ్ గా ఉండే బ్రిస్సెల్స్ చిగుళ్లను దెబ్బతీస్తాయి. బ్రష్ బ్రిస్సెల్స్ మరీ గట్టిగా ఉన్నవి కాకుండా కాస్త సున్నితంగా ఉన్నవి వాడాలి. ఎక్కువ మంది ఉదయం లేచి బ్రష్ చేశాక మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు దానిని ముట్టుకోరు. అలా కాకుండా మధ్నాహ్నం భోజనం చేశాక, లేదా రాత్రి డిన్నర్ తిన్నాక కూడా బ్రష్ చేస్తే చాలా మంచిది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడు పూటలా అని అనుకునేవారు.. మధ్యాహ్నం కాకపోయినా.. కనీసం రాత్రి మాత్రం కచ్చితంగా పడుకోబోయే ముందు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్లు, నోరు శుభ్రంగా ఉంటాయి. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు.