సాధారణంగా పెళ్లి చేసుకోబోయే యువతి లేదా యువకుడు ఎవరైనా తమకు కాబోయే జీవిత భాగస్వామికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారినే ఎవరైనా సెలెక్ట్ చేసుకుని మరీ పెళ్లి చేసుకుంటారు. అయితే తరువాత ఆ విషయంలో పొరపాటు కూడా జరగవచ్చు, అది వేరే విషయం. కానీ… యువకులేమో గానీ యువతులు మాత్రం పెళ్లి చేసుకోబోయేముందు తమకు కాబోయే వాడికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండొద్దని కోరుకుంటారు. మద్యపానం, ధూమపానం, అమ్మాయిల వ్యసనం, జూదం వంటివి తాము పెళ్లి చేసుకోబోయే వరుడికి ఉండొద్దని అనుకుంటారు. అయితే అవే కాదు, పెళ్లి చేసుకోబోయే యువతులు యువకుల్లో అసలు ఇంకా పరీక్షించాల్సిన, తెలుసుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. ఈ అలవాట్లును ఉన్న యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోకూడదట, అవును మీరు విన్నది కరెక్టే. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటంటే…
అస్తమానం ఏదో ఒక కండిషన్ లేదా ఆంక్షలు పెట్టే యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోకూడదట. వారు అలా ఆంక్షలు పెడితే ఇబ్బందులు వస్తాయట. అది ఎంతకైనా దారి తీస్తుందట. కనుక అలా ఆంక్షలు, కండిషన్లు పెట్టే యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోరాదు. జంతువులను హింసించే లేదా జంతువులు అంటే ఇష్టం లేని యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదట. ఎందుకంటే జంతువుల్లాగే భవిష్యత్తులో కట్టుకున్న పెళ్లాన్ని కూడా వారు హింసిస్తారట. అందుకని అలాంటి యువకులను పెళ్లాడరాదు. ఎవరితోనైనా ఉన్న సంబంధాన్ని ఇట్టే తెగతెంపులు చేసుకునే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదు. ఎందుకంటే వారికి సంబంధాలు అంటే అంతగా ఇష్టం ఉండకపోతే భార్యను కూడా తేలిగ్గా తీసుకుని డైవోర్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఏదైనా మాట ఇచ్చి తప్పే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదు. అలాంటి వారిని నమ్మడం చాలా కష్టం. రిలేషన్‌షిప్ నిలబడదు. కట్టుకోబోయే భార్యకు కాకుండా ఇతరులకెవరికైనా అధిక ప్రాధాన్యతను ఇచ్చే యువకులను కూడా యువతులు పెళ్లాడరాదట. ఎందుకంటే వారు భార్యను అంతగా ప్రేమించరట. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోని వారు, తీసుకున్న నిర్ణయం పట్ల కూడా పదే పదే ఆలోచించే యువకులను యువతులు పెళ్లాడరాదు. ఎందుకంటే వీరికి తాము తీసుకున్న నిర్ణయం తప్పనే భావన ఉంటుంది. దీంతో వారు ఎప్పుడూ సరైన నిర్ణయాలను తీసుకోలేరు. ఏదైనా తప్పు, పొరపాటు చేస్తే అవతలి వారిని ఎవరైనా క్షమించమని అడుగుతారు. అది కామనే. కానీ… అవసరానికి మించి సారీలు చెప్పే యువకులను మాత్రం పెళ్లాడరాదట. వారు అతిగా స్పందిస్తారు కనుక, అలాంటి వారి పట్ల దూరంగా ఉండడమే మంచిది.
ఎదుటి వారు చెప్పే దాన్ని అర్థం చేసుకోకుండా చీటికీ మాటికీ ఇతరులతో గొడవపడే యువకులను కూడా పెళ్లి చేసుకోవద్దట. ఇది ఇబ్బందులను తెచ్చి పెడుతుందట. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడకుండా, అడ్డం దిడ్డం వాగుతూ, సంభాషణలను మధ్యలోనే ఆపేసే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వారికి ఎదుటి వారంటే మర్యాద ఉండదు కనుక, వారికి దూరంగా ఉండాలి. అబద్దాలు చెప్పే యువకులకు కూడా యువతులు దూరంగా ఉండాలి. ఎందుకంటే పెళ్లయ్యాక రేపెప్పుడైనా ఏ విషయంలోనైనా అబద్దాలు ఆడితే అది విడాకుల వరకు దారి తీయవచ్చు. కనుక వారికి యువతులు దూరంగా ఉండాలి. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడకుండా ఇతరులపై ఆధారపడి జీవించే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వారు ఏ పనీ చేయరు, పెళ్లాం సంపాదన పైనే ఆధార పడతారు. ఇది ఎప్పటికైనా కష్టాలను కలగజేస్తుంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులంటే ఇష్టం లేకుండా, వారిని అస్తమానం హింసించే, తిట్టే యువకులను యువతులు పెళ్లాడరాదు. వారు భార్యల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉంటుంది. హింసాత్మక ప్రవృత్తి ఎక్కువగా ఉన్న యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదు. వారు భార్యలను కూడా హింసించేందుకు వెనుకాడరు. కనుక వారికి కూడా దూరంగా ఉండాలి.