అత్యంత పాశవిక కేసుల్లో ఖైదీగా ఉన్న వారికి ఉరి శిక్షను అమలు పరుస్తారు . అయితే ఉరి అమలుకు ముందు ఎంచేస్తారో తెలుసా..? జైళ్ల మాన్యువల్ ప్రకారం.. ఖైదీని తెల్లవారుజామునే నిద్ర లేపుతారు. మేల్కొలిపిన 10 నిమిషాల తర్వాత.. స్నానం చేయాల్సిందిగా చెబుతారు. స్నానం చేశాక.. ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీ ఉన్న సెల్ వద్దకు చేరుకుంటారు. ఉరి తీయడానికి గల కారణాలు ఖైదీకి తెలుపుతూ తమ వద్దనున్న వారంట్‌ను చదివి వినిపిస్తారు.
స్నానం తర్వాత వెంటనే ఖైదీకి అల్పాహారం అందజేస్తారు. వారు అడిగినవి జైలు క్యాంటీన్‌లో లభ్యం కాకపోతే.. ఆఖరి కోరికను తీర్చేందుకు బయటి నుంచి తెప్పిస్తారు. అల్పాహారం అనంతరం.. కాసేపు ప్రశాంతంగా గడపడానికైనా, ఏదైనా మతపరమైన పుస్తకాన్ని చదువుకోవడానికైనా, లేదా కాసేపు ప్రార్థనకైనా అనుమతిస్తారు. ఆ తర్వాత ఉరికంబం వద్దకు ఖైదీని తీసుకెళ్తారు. ఉరికంబం ఎక్కించి.. ముఖంపై కాటన్‌తో తయారుచేసిన నల్లని తొడుగును కప్పుతారు.
మేజిస్ట్రేట్ సంకేతం ఇవ్వగానే.. ఖైదీ కాళ్ల కింద ఉన్న తలుపులు తెరుచుకునేలా తలారి లీవర్‌ను లాగుతాడు. ఉరితాడు బిగిసిన తర్వాత అరగంటసేపటి దాకా అలాగే ఉంచుతారు. ఖైదీ మరణించినట్టు వైద్యాధికారి ధ్రువీకరించాక, ఆ విషయాన్ని హోం శాఖ అధికారులకు తెలియజేస్తారు. హోం శాఖ.. ఖైదీ కుటుంబసభ్యులకు ఆ సమాచారమిస్తుంది. మృతదేహానికి జైల్లోనే అటాప్సీ (శవపరీక్ష) నిర్వహిస్తారు.
ఉరిశిక్ష అమలు ప్రక్రియ ముగిసిన అనంతరం, ఖైదీ మృతదేహాన్ని జైల్లోనే ఖననం చేయాలా లేక బంధువులకు అప్పగించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని సమాచారం. ఉరి శిక్షను అమలు చేసిన తలారి ఎవరనేది కొన్ని కారణాల వల్ల రహస్యంగా ఉంచుతున్నారు. అలాగే ఉరికి ఉపయోగించే తాడును కూడా అరటి పండ్ల గుజ్జు, వెన్న రాసి మూడు రోజుల ముందు నుండే రెడీ చేస్తారు.