ప్రపంచంలోని అనేక దేశాల్లో బియ్యంతో వండిన అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. ఇక మన దేశంలోనూ చాలా మందికి అన్నమే మొదటి ఆహారం. అలాగే మన పొరుగు దేశమైన చైనాలోనూ ఎక్కువగా అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. తరువాతే మిగిలినవి. అయితే అన్నం తినడం వల్ల మనకు ఎలాగైతే శక్తి లభిస్తుందో, బియ్యం వల్ల కూడా మనకు ఓ ముఖ్యమైన లాభం కలుగుతుంది. అదేమిటో తెలుసా..? బియ్యం వల్ల జుట్టు పొడవుగా, దృఢంగా పెరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే.
చైనాలోని హువాంగ్లూ గ్రామంలో ఉండే యావో అనే తెగకు చెందిన మహిళలకు ఒక్కొక్కరికి సగటున 6 నుంచి 10 అడుగుల వరకు జుట్టు ఉంటుంది. వెంట్రుకలు అంత పొడవుగా వారికి పెరుగుతాయి. అయితే అలా వారికి వెంట్రుకలు పొడవుగా పెరగడానికి కారణం ఏమిటో తెలుసా..? ఇంకేమిటి.. బియ్యమే. అవును, కరెక్టే. వారు బియ్యంతో తమ జుట్టును అలా సంరక్షించుకుంటారు. అందుకే వారి శిరోజాలు అంత దృఢంగా, పొడవుగా పెరుగుతాయి.
యావో తెగకు చెందిన మహిళలు తమ శిరోజాల సంరక్షణకు బియ్యాన్ని ఎలా వాడుతారో తెలుసా..? బియ్యం కడిగిన నీళ్లను జుట్టు కుదుళ్లకు బాగా పట్టిస్తారు. అనంతరం ఒక గంట తరువాత తల స్నానం చేస్తారు. దీంతో జుట్టు దృఢంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ట్రిక్ ను వారు పాటించడం వల్లే వారి జుట్టు అంత పొడవుగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యంత పొడవైన శిరోజాలు కలిగిన మహిళలు ఉన్న గ్రామంగా ఆ ప్రాంతం ఇప్పటికే గిన్నిస్ రికార్డును కూడా సాధించింది. మరింకెందుకాలస్యం.. మీరు కూడా మీ శిరోజాలను సంరక్షించుకోవాలంటే.. పైన తెలిపిన ట్రిక్ ను ఫాలో అవండి మరి..!