ఒకానొక సారి గౌతమ బుద్ధుడు ఓ చెట్టు కింద కూర్చుని ఉండగా అతనికి చెందిన ఓ శిష్యుడు దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడుగుతాడు. మనిషి చనిపోయాక ఏమవుతుంది..? అతను ఎటు వెళతాడు..? అని అతను బుద్ధున్ని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే… నీ చేతికి ఓ బాణం వచ్చి గుచ్చుకుందనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు..? బాణం తీసేస్తావా..? లేదంటే అది ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతుక్కుంటూ దాని దిశగా వెళతావా..? అంటాడు. అందుకు ఆ శిష్యుడు సమాధానం చెబుతూ… ముందు చేతిలో గుచ్చుకున్న బాణం తీసేస్తాను. అనంతరం ఆ గాయాన్ని ఎలా మాన్పించాలి అని దారులు వెతుకుతాను. అని సమాధానం చెబుతాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు… చూశావా..! మనిషి మరణించడమనేది తరువాతి సంగతి. ముందు అతను తన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి. అంతే అంటాడు..! అందుకు శిష్యుడు సత్యం బోధపడినట్టు తలూపి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరో సందర్భంలో బుద్ధుడు చెట్టు కింద ధ్యానంలో ఉండగా కొందరు పిల్లలు ఆ చెట్టుకు ఉన్న పండ్లను రాళ్లతో కొట్టి తింటుంటారు. ఈ క్రమంలో ఓ రాయి వచ్చి బుద్ధునికి తాకి రక్తం కారుతుంది. అప్పుడు దాన్ని చూసి ఆ పిల్లలు భయపడుతారు. అయితే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే… చెట్టును రాళ్లతో కొడితే అది మీకు తియ్యని పండ్లను ఇచ్చింది, కానీ నన్ను రాళ్లతో కొడితే నేను ఏమీ ఇవ్వలేకపోయాను… అని బాధ పడతాడట. అదీ బుద్ధుని గుణం..!
ఇంకోసారి బుద్ధుడు ప్రవచనాలు చెబుతుండగా ఓ నాట్యకారుడు వచ్చి అంటాడు. స్వామీ… నేను ఈ రాత్రికి నృత్య ప్రదర్శన చేయాల్సి ఉంది. మీ మాటల వల్ల అది గుర్తుకు వచ్చింది. అందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళతాడు. అప్పుడు ఓ దొంగ వచ్చి అంటాడు… స్వామీ… మీరు చెప్పిన విషయాలలో పడి నేను ఓ దొంగతనం చేయాల్సి ఉంటే దాన్ని మరిచిపోయా… అంటాడు. అనంతరం ఇంకో వృద్ధుడు వచ్చి… అయ్యా… నేను నా జీవితం మొత్తం విలాసవంతమైన వస్తువులు కావాలని వాటి వెంట పడ్డాను. కానీ… మీ మాటల వల్ల ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నేను నా జీవితాన్ని వృథా చేశానని..! ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయను. వెంటనే నేను మోక్షం పొందేందుకు యత్నిస్తా… అని అక్కడి నుంచి వెళతాడు. ఆ తరువాత కొంత సేపటికి జనాలందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా, అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో అంటాడు… చూశారుగా… నేను చెప్పిన ప్రవచనాలు ఒకటే. కానీ వాటిని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా అర్థం చేసుకున్నారు. అలాగే మీరు కూడా మీ ఆలోచనా సరళిని విస్తరించండి. అన్నీ తెలుస్తాయి అంటాడు..!