lifestyle

బ్రిటీష్ వారు లేకుంటే మరే ఇతర ఐరోపా శక్తులు భారతదేశాన్ని దోచుకునేవా?

ఖచ్చితంగా దోచుకునేవి. బ్రిటీషు వారితో పాటు, బుడతకీచులు(portuguese), ఫ్రెంచి వారు, డచ్చి వారు మన దేశంలో స్థావరాలు ఏర్పరుచుకుని రాజ్య విస్తరణ చేసే దిశగా ప్రయత్నించారు. బ్రిటీషు వారికి అధిక వనరులు ఉండటం, వారి అంతర్గత పరిస్థితులు నిలకడగా ఉండటం, అదే సమయంలో ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవం మొదలయ్యి వారు ఇతర దేశాల కన్నా సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవటం వల్ల వీరు ఇతర ఐరోపా శక్తుల మీద పై చేయి సాధించగలిగారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా ఎన్నో రెట్లు పెద్దది, శక్తిమంతమైనది, VOC(డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ) ప్రస్తుత ఇండోనేసియా, మలేసియా, ఇతర తూర్పు ఆసియా దేశాల సుగంధ ద్రవ్యాల వాణిజ్యం మొత్తం వీరి చేతిలోనే ఉండేది. వీరు పులికాట్ సరస్సు ప్రధాన కేంద్రంగా మచిలీపట్నం, నాగపట్నం, రాజమండ్రి, భీమునిపట్నం, నాగులవంచలో(ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంది) స్థావరాలు, కోటలు ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పటి రాజమండ్రి జైలు ఉన్న చోట వారి కోట ఉండేది. భీమునిపట్నంలో వారి భవనాలు, సమాధులు ఇప్పటికీ మనం చూడవచ్చు. నాగులవంచలో వారి ఆగడాలను సహించలేని స్థానికులు 1687లో వారి స్థావరంపై దాడి చేసి దాన్ని సమూలంగా నాశనం చేశారు. బహుశా భారత దేశంలో సామాన్య ప్రజలు(రాజులు కాకుండా) యూరోపియన్ శక్తులపై తిరగబడడం ఇదే మొదటి సారి కావచ్చు. ఉత్తర భారత దేశం, బెంగాలు, పంజాబు రాష్ట్రాలపై మక్కువ ఉన్న చరిత్రకారులు దీనికి ప్రచారం కల్పించలేదు. మన చరిత్ర గురించి ఆసక్తి లేని మన తెలుగు వారు దీని గురించి విని కూడా ఉండరు. VOC వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ కోల్పోయి బలహీనపడింది. పోర్చుగీసు వారితో యుద్ధాల వల్ల ఇరువురు బాగా నష్ట పోయారు. అయితే డచ్చి వాడి సామ్రాజ్య స్థాపన కాంక్షను సమూలంగా నాశనం చేసింది తిరువాన్కూరు మహారాజు మార్తాండ వర్మ. ఈయన కులాచల యుద్ధంలో డచ్చి వాడిని చిత్తు చిత్తుగా ఓడించాడు. వారి నాయకుడు డి లనాయ్ మోకాళ్ళ మీద కూర్చుని క్షమించమని అడిగితే వాడికి, వాడి సైన్యానికి ప్రాణ భిక్ష పెట్టి వదిలేశాడు.

what would have happened if british not came to india

డచ్చి వారి రాజ్య విస్తరణ కాంక్షలకు చరమ గీతం పాడిన ఈ యుద్ధానికి దేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నపటికీ మన ప్రసిద్ధ చరిత్రకారులు, పెద్దలు ఎందుకో దీన్ని విస్మరిస్తారు. ఒక భారత రాజు, యూరోపియన్ సైన్యంపై గెలిచాడనే అక్కసు కావచ్చు. ఈ యుద్ధంతో డచ్చి వారి సామ్రాజ్య కాంక్షలు ఆవిరయ్యాయి. బ్రిటీషు వారితో సంధి చేసుకుని మిగిలిన స్థావరాలను 1825లో వారికి అప్పగించి నిష్క్రమించారు. మన దేశానికి మొదట వచ్చింది పోర్చుగీసు వారే. చివరన పోయిందీ (తరిమి కొట్టబడిందీ) వీరే. సామ్రాజ్యం స్థాపించడానికి అన్ని అవకాశాలు ఉన్నపటికీ వారే చేజేతులా నాశనం చేసుకున్నారు. బొంబాయి వీరిదే. వారి రాకుమార్తె అయిన కేథరిన్ ఇంగ్లాండు రాజైన రెండవ చార్ల్స్ను పెళ్ళాడినప్పుడు కట్నం కింద బొంబాయిని బ్రిటీషు వారి పరం చేశారు. మత మౌఢ్యం, ఇతర యూరోపియన్ దేశాలతో, విజయనగర, బీజాపూర్, మొఘల్ రాజ్యాలతో యుద్ధాలు వీరిని గోవాకు, గుజరాత్లో రెండు చిన్న ప్రాంతాలకు పరిమితం చేశాయి సైనిక చర్యతో దిగి వచ్చి 1961లో ఖాళీ చేశారు.

గోవాలోని హస్త ఖండనా స్తంభం. మతం మారని హిందువుల చేతులను ఇక్కడ నరికేసే వారు. ఫ్రెంచి వారు చివరిగా వచ్చిన వారు. వీరికీ బ్రిటీషు వారికి అంతకు పూర్వమే ఉన్న శతృత్వం వల్ల వీరు మన దేశంలో బ్రిటీషు వారి శతృ పక్షం వహించే వారు. హైదరాబాదు, ఆర్కాటు వారసత్వ యుద్ధాలలో చెరొకరి పక్షం వహించే వారు. వారి గవర్నరుగా డుప్లేయి ఉన్నప్పుడు ఫ్రెంచి, బ్రిటీషు వారి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండి ఫ్రెంచి వారికి కొంత మొగ్గు కనపడింది. మద్రాసు నగరాన్ని కొంత కాలం బ్రిటీషు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఐరోపాలో రెండు దేశాల మధ్య సంధి కుదరటం, ఫ్రాన్స్ దేశంలో తరచుగా అరాచక పరిస్థితులు ఏర్పడటం వల్ల వీరు పుదుచ్చేరి, యానాం, రెండు ఇతర చిన్న ప్రాంతాలు తప్ప మొత్తం బ్రిటీషు వారి పరం చేయ వలసి వచ్చింది.

మైసూరు యుద్ధ కాలంలో హైదర్ అలీ, అతడి కుమారుడు టిపు సుల్తానులు ఇరువురు ఫ్రెంచి వారు వారికి ఆంగ్లేయులపై యుద్ధంలో సాయ పడతారని ఆశ పడ్డారు. కానీ అదే సమయంలో ఫ్రెంచి విప్లవం జరగటం, వారి స్వదేశంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఇది జరగలేదు. చివరికి 1954లో దడాల రాఫెల్ రమణయ్య అనే తెలుగు స్వతంత్ర వీరుడు ఎంతో సాహసోపేతంగా యానాంపై దాడి చేసి ఫ్రెంచి తూటాలకు ఎదురు వెళ్లి యానాం పట్టణాన్ని విముక్తి చేశాడు. బహుశా ఈయన తెలుగు వాడిగా పుట్టినందువల్ల రావలసిన పేరు రాలేదు. యానాం విముక్తి తర్వాత పుదుచ్చేరి, ఇతర ఫ్రెంచి ఆక్రమిత ప్రాంతాలు అదే సంవత్సరంలో స్వతంత్ర భారత దేశంలో విలీనమైనాయి. వీరే కాకుండా డెన్మార్క్ వారికి కూడా బెంగాలులో, నికోబార్ ద్వీపాలలో చిన్న వలసలు ఉండేవి. వాటిని పంతొమ్మిదవ శతాబ్ది లోనే డెన్మార్క్ బ్రిటిష్ వారికి అప్పగించేసింది. ఇలా ఎన్నో వందల ఏళ్ల తర్వాత మన దేశంలో యూరోపియన్ శక్తుల శకం ముగిసింది.

Admin

Recent Posts