వివాహ వ్యవస్థలో ఒకప్పుడు ఒకరి ఇల్లు అంటూ ఏమీ లేదు. భర్త, భార్య మొదలైన ఆ రోజుల్లో పిల్లల ఆవిర్భావానికి, పెంపకానికి భార్య ముఖ్యమై ఒక ఇల్లు ఏర్పరచుకోవటం జరిగింది. ఆ సమయంలో భర్త వేటకు పళ్ళు, ఆకులను ఏరుకురావడానికి వెళ్ళినప్పుడు, భార్య ఇంటి పనులు చూసుకుంటూ కాలక్రమేనా తీరిక సమయాల్లో దొరికిన గింజలను ఇంటి చుట్టూ వేసి వరి, గోధుమ, వగైరా పంటల వ్యవసాయానికి నాంది పలికింది.
ఇలా మొదలైన వ్యవసాయ భూముల యాజమాన్యం ముందుగా ఇద్దరికీ ఉన్న రాను రాను వాటిలో ఎక్కువగా పని చేసే మగవానికే దక్కింది. (విరోధులతో పోరాడి ఆదిపత్యాన్ని సాధించుకునే శక్తి మగవారిలో ఉండటం వల్ల కూడా) ‘పితృస్వామ్యం’ అవతరించింది. అయినా ఈ నాటికి కేరళలోని కొన్ని సమాజాలలో మాతృస్వామ్యమే వ్యవస్థాగతమైనది! ఇల్లాలే ఇంటి యజమాని!
పితృస్వామ్య వ్యవస్థలో భార్యా భర్త ఇంటికి, ఊరికి రావాల్సిందే కదా! వ్యవసాయ భూములు ఆడపిల్లవి ఇతరులకు చెందకూడదని, పైగా ఆవిడ తల్లిదండ్రుల కళ్ళముందే ఉంటుందని… మేనరిక వివాహాలు చేసేవారు. ఈనాడు వ్యవసాయక వ్యవస్థ వడివడిగా ఆధునిక, పారిశ్రామిక, సాంకేతిక వ్యవస్థగా మారుతూ పల్లెలు ఖాళీ అయి పట్టణీకరణ, ప్రపంచీకరణ జరుగుతూ, ఉమ్మడి కుటుంబాలు అంతమై జంట కుటుంబాలు నిత్యమయ్యే వేళ భార్య భర్త ఇంటికి, భర్త భార్య ఇంటికి వెళ్లడం లేదు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉమ్మడిగా ‘వారి’ ఇంటికే వెళ్తున్నారు. అందుకే పెళ్లి అయిన తర్వాత భార్య, భర్త ఇంటికి ఎందుకు వెళ్తుందట.