పచ్చ కామెర్లు వచ్చిన వారి శరీరం సహజంగానే పసుపు రంగులోకి మారుతుంది. గోళ్లు, కళ్లు పసుసు పచ్చగా కనిపిస్తాయి. అయితే పచ్చ కామెర్లు అంత ప్రాణాంతకం కాదు. కానీ నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాల మీదకు తెస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పలు ఇతర కారణాల వల్ల కూడా గోళ్లు, కళ్లు పచ్చగా కనిపిస్తుంటాయి. అది ఎప్పుడు ? అంటే..
మన శరీరంలోని రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడుతూ చనిపోతూ ఉంటాయి. అలాగే బైలిరుబిన్ అనే సమ్మేళనం కూడా రక్తంలో ఉంటుంది. రక్తంలోని మృత కణాలను లివర్ బయటకు పంపుతుంది. కానీ లివర్ పనులకు ఆటంకం ఏర్పడితే.. అప్పుడు మృత కణాలు బయటకు పోవు. అలాగే రక్తంలో బైలిరుబిన్ పేరుకుపోతుంది. దీంతో శరీరం పసుపు పచ్చగా మారుతుంది. ఈ స్థితిని పచ్చ కామెర్లు అంటారు.
కానీ పలు ఇతర కారణాల వల్ల కూడా శరీరం అలా పసుపు రంగులోకి మారుతుంటుంది. కలుషితమైన ఆహారాలను తీసుకున్నప్పుడు, ద్రవాలను తాగినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్లు, మద్యం ఎక్కువగా సేవించడం, రక్తం ఇన్‌ఫెక్షన్లు, హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్, మందులను ఎక్కువగా వాడడం, భార లోహాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం, ఇన్‌ఫెక్షన్ ఉన్న రక్తం ఎక్కించడం.. వంటి భిన్న కారణాల వల్ల కూడా శరీరం పసుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి స్థితిలో గోళ్లు, కళ్లు కూడా పసుపు రంగులో కనిపిస్తాయి.
అయితే ఈ విధంగా అవయవాలు పసుపు రంగులో కనిపిస్తున్నాయంటే.. కామెర్లు మాత్రమే కాకుండా.. పైన చెప్పిన వాటిలో ఏదైనా కారణం అయి ఉండవచ్చు. కనుక వెంటనే డాక్టర్‌ను కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకుని.. అందుకు అనుగుణంగా మందులను వాడాలి. దీంతో సమస్యకు మూల కారణం కనుక్కుని ఆ విధంగా చికిత్స తీసుకుని అనారోగ్య సమస్య నుంచి బయట పడవచ్చు. లేదంటే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక శరీర అవయవాలు పసుపు రంగులో కనిపిస్తున్నాయంటే.. వెంటనే జాగ్రత్త పడాల్సిందే..!