Sneeze : జలుబు బాగా ఉన్నప్పుడు ఎవరికైనా తుమ్ములు సహజంగా వస్తాయి. వాటిని ఎవరూ ఆపలేరు. అయితే జలుబు తగ్గేందుకు వేసుకునే మందుల వల్ల తుమ్ములను కొంత వరకు ఆపవచ్చు. కానీ దాదాపుగా ప్రతి ఒక్కరు జలుబు లేకున్నా నిత్యం ఏదో ఒక సందర్భంలో తుమ్ముతారు. అందుకు అలర్జీలు, దుమ్ము వంటి కారణాలు ఉంటాయి. అయితే ఎవరు ఎప్పుడు ఎలా తుమ్మినా కచ్చితంగా కళ్లు మూసుకునే తుమ్ముతారు. కళ్లు తెరచి ఎవరూ తుమ్మరు. అలా కళ్లు తెరిచి తుమ్మితే కను గుడ్లు బయటికి పడతాయని అధిక శాతం మంది నమ్ముతారు. అయితే అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కంటి నరాలకు, ముక్కు నరాలకు డైరెక్ట్‌గా సంబంధం ఏమీ ఉండదట. కానీ తుమ్మినప్పుడు మాత్రం ఓ నాడి మెదడుకు సిగ్నల్ పంపుతుందట. దాంతో మనం ఆటోమేటిక్‌గా కళ్లు మూసుకుంటాం. అయితే అలా కళ్లు మూసుకోవడం మంచిదేనట. ఎందుకంటే తుమ్మినప్పుడు మన ముక్కు నుంచి వచ్చే బాక్టీరియా, వైరస్‌లు కళ్లలోకి వెళ్లకుండా ఉంటాయట. అందుకే తుమ్మినప్పుడు మనం కచ్చితంగా కళ్లు మూసుకుంటామట. అయితే దాదాపుగా చాలా తక్కువ మంది మాత్రమే కళ్లు తెరచి కూడా తుమ్మగలరట.
కళ్లు తెరచి తుమ్మడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదట. అలా చేయడం కొందరికే సాధ్యమవుతుందట. అయితే కళ్లు తెరచి తుమ్మినా కళ్లు మాత్రం బయట పడవట. ఎందుకంటే పైనే చెప్పాం కదా, కళ్లకు, ముక్కుకు డైరెక్ట్‌గా సంబంధం ఉండదని. అంతేకాదు, తుమ్ము ఎంత వేగంగా వచ్చినా కళ్లు తెరిచి తుమ్మితే దాంతో కళ్లు మాత్రం బయట పడవు. ఎందుకంటే కళ్లు ఆరు రకాల extra-ocular కండరాలతో నిర్మాణమవుతాయి. కాబట్టి అవి అంత తేలిగ్గా ఊడి బయట పడవు. వాటి స్థానంలో కళ్లు చాలా గట్టిగా, దృఢంగా పాతుకుని ఉంటాయి. తెలుసుకున్నారుగా, కళ్లు తెరచి తుమ్మినా ఏం కాదని. కానీ అలా చేయడం అందరికీ వీలు పడదు. తుమ్మే సమయంలో ఎంత తెరచి ఉంచినా కచ్చితంగా మనం కళ్లు మూసుకుంటాం. కళ్లు తెరిచి తుమ్మడం దాదాపుగా ఎవరికీ సాధ్యమయ్యే పనికాదని చెప్పవచ్చు.