Darkness On Neck And Armpits : మనలో చాలా మందికి మెడ, మోచేతులు, మోకాళ్లు, తొడల భాగంలో, చంకల కింద, అలాగే వేళ్ల జాయింట్ ల వద్ద చర్మం నల్లగా ఉంటుంది. అలాగే కొందరిలో మెడ దగ్గర చర్మం నల్లగా ఉండడంతో పాటు పగిలినట్టుగా చారలుగా ఉంటుంది. అలాగే ఈ భాగాల్లో చర్మం మందంగా, గరుకుగా ఉంటుంది. దీనిని వైద్య పరిభాషలో ఆకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. ఈ సమస్య తలెత్తడానికి వివిధ కారణాలు ఉన్నాయి. బరువు పెరగడం వల్ల, శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల, మెటాబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఇన్సులిన్ నిరోధకత, వ్యాయామం చేయకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం వంటి కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే కొందరిలో జన్యుపరంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి సమస్యలతో బాధపడే వారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆయా భాగంలో చర్మం తెల్లగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో బాధపడే వారు రోజుకు కనీసం రెండు గంటల పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీవక్రియల రేటు పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎండలో తిరిగేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ ను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మనం చేసే పనికి తగినట్టుగా క్యాలరీలను తీసుకోవాలి. అధిక క్యాలరీలను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే చక్కెరలు కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటాయి.
దీంతో సాధారణ కణాలు క్రమంగా ఫ్యాటీ కణాలుగా మారతాయి. ఇలా మారడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగి మెడ చుట్టూ నల్లగా మారుతుంది. కనుక మనం ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. చక్కటి జీవన విధానాన్ని పాటించాలి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రోజుకు రెండు నుండి మూడు ఉసిరికాయలను తీసుకోవాలి. ఈ చిట్కాలను వాడడం వల్ల సమస్య నుండి మనం దాదాపుగా బయటపడవచ్చు. అయితే మెడ చుట్టు చర్మం మరీ నల్లగా ఉన్నవారు చర్మ వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.