డిప్రెషన్ అనేది చాలా మందికి రక రకాల కారణాల వల్ల వస్తుంది. లవ్ ఫెయిల్యూర్, పరీక్షల్లో పాస్ కాకపోవడం, తీవ్రమైన అనారోగ్య లేదా ఆర్థిక సమస్యలు ఉండడం.. ఇలా డిప్రెషన్ వచ్చేందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే వీటిని ఆరంభంలో గుర్తిస్తే అలాంటి వారిని రక్షించుకోవచ్చు. లేదంటే వారు ఆత్మహత్య చేసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి డిప్రెషన్ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* డిప్రెషన్ వచ్చిన వారు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు కనిపిస్తుంటారు. జీవితంలో తాము చాలా కోల్పోయామని, ఎంతో నష్టపోయామని అనుకుంటుంటారు. ఆ లక్షణం వారి మాటల్లో కనిపిస్తుంది. ఇక వారు ఎల్లప్పుడూ దిగులుగా ఉంటారు. ఏదో ఒక విషయం ఆలోచిస్తూ బాధపడుతుంటారు.
* డిప్రెషన్ వచ్చిన వారికి ఏ పనీ చేయబుద్ది కాదు. ఏ పనిలోనూ ఆసక్తి ఉండదు. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఫీలవ్వరు. అంతా అయిపోయిందని భావిస్తారు.
* డిప్రెషన్ లో ఉన్నవారు తాము తప్పు చేశామని భావనను కలిగి ఉంటారు. పదే పదే వారు అలాంటి విషయాలను మాట్లాడుతుంటారు. తాము తప్పు చేయడం వల్లే నష్టం కలిగిందనో, ఇంకేదైనా జరిగిందనో అంటుంటారు.
* డిప్రెషన్ లో ఉన్నవారు ఎప్పుడూ అలసటగా ఉందని, నీరసంగా ఉంటుందని చెబుతుంటారు. ఇక వారు నిద్ర సరిగ్గా పోరు. నిద్రలేమితో బాధపడుతుంటారు.
* డిప్రెషన్ లో ఉన్నవారికి కొందరికి ఆందోళన ఉంటుంది. ఏ పని చేసినా ఆందోళన చెందుతారు. ఏదో జరిగిపోతుందని ఫీల్ అవుతారు. మాటి మాటికీ భయ పడుతుంటారు. తీవ్రంగా చెమట పడుతుంటుంది.
* డిప్రెషన్ వచ్చిన వారు ఎల్లప్పుడూ విసుగు చెందుతుంటారు. ఏం చేద్దామన్నా ఆసక్తిని చూపించరు. చీటికీ మాటికీ విసుక్కుంటారు.
* డిప్రెషన్ వచ్చిన వారు సహజంగానే వారికి తెలియకుండానే ఎక్కువగా తింటారు. బరువు పెరుగుతారు.
* డిప్రెషన్ వచ్చిన వారు కోపాన్ని అణచుకోలేరు. ఎవరిపై అయినా సరే అరిచేస్తుంటారు.
* డిప్రెషన్ లో ఉన్నవారు చనిపోవడం ఒక్కటే మార్గమని భావిస్తుంటారు. ఆ లక్షణం వారి మాటల్లో, చేతల్లో కనిపిస్తుంది. ఇలాంటి వారు సడెన్ గా ఆత్మహత్య చేసుకుంటారు. ఎప్పుడు ఏం చేయబోయేది కనిపెట్టడం కష్టం. కనుక ఇలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచాలి.
డిప్రెషన్‌లో ఉన్నవారు తమకు ఏదైనా బాధ ఉంటే కుటుంబంలో అత్యంత దగ్గరగా ఉండే ఎవరికైనా లేదా దగ్గరగా ఉండే స్నేహితులకు అయినా తమ మనస్సులోని బాధను చెప్పుకోవాలి. దీంతో చాలా రిలీఫ్ వస్తుంది. మనస్సులో బాధను అధిగమించి ఉండడం కష్టం. కనుక దాన్ని ఎవరితో అయినా పంచుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది.
డిప్రెషన్ వచ్చిన వారు రోజూ ధ్యానం, యోగా, వ్యాయామం చేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. హెర్బల్ టీ లను తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది.