Heart Failure Symptoms : నేటి తరుణంలో మనలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మనల్ని ఎక్కువగా వేధించే గుండె సంబంధిత సమస్యలల్లో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ( సిహెచ్ఎఫ్) ఒకటి. ఇందులో గుండె పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కనుక గుండె వైఫల్యం చెంది మరణానికి దాని తీస్తుంది. అయితే చాలా మంది దీనిని ముందుగానే గుర్తించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనే ఈ సమస్య తలెత్తినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల మనం తగిన సమయంలో వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చు. దీంతో మన ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉంటుంది. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడే వారిలో ముందుగానే కనిపించే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సమస్యతో బాధపడే వారిలో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, వేగంగా నడిచేటప్పుడు, శారీరక శ్రమ చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి శ్రమించాల్సి ఉంటుంది. అలాగే చిన్న చిన్న పనులకే శరీరం అలిసిపోయినట్టుగా అవుతుంది. విపరీతమైన అలసట, నీరసం వంటి లక్షణాలను మనం గమనించినట్టయితే ఇది గుండె వైఫల్యానికి గుర్తుగా భావించాలి. సిహెచ్ఎఫ్ తో బాధపడే వారిలో పాదాలు, కాళ్లు, చీలమండలంలో నీరు చేరి అవి ఉబ్బిపోతాయి. అలాగే పొత్తి కడుపు కూడా నీరు చేరి లావుగా తయారవుతుంది. అదేవిధంగా గుండెలయ దెబ్బతింటుంది. గుండె దడగా ఉంటుంది. గుండె క్రమరహితంగా కొట్టుకుంటుంది. కొన్నిసార్లు గుండె కొట్టుకునే శబ్దం కూడా మనకు వినిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. ఇక మనం రోజూ చేసే వ్యాయామాలు కూడా సరిగ్గా చేయలేకపోతాము.
వ్యాయామం చేయడం కష్టతరంగా మారుతుంది. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు గురక లేదా ఎక్కువగా శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ లక్షణం కనిపించిన వెంటనే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గుండె వైఫల్యం చెందుతున్నప్పుడు దగ్గు ఎక్కువగా వస్తుంది. దగ్గుతో పాటు తెల్లటి లేదా గులాబి రంగులో ఉండే శ్లేష్మం కూడా వస్తుంది. ఇది కూడా గుండె వైఫల్యానికి సంకేతంగా భావించాలి. అదేవిధంగా సిహెచ్ఎఫ్ తో బాధపడే వారిలో పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ సమస్యను కూడా మనం గుండె వైఫల్యానికి హెచ్చరికగా భావించాలి. ఇక గుండె సమస్యలతో బాధపడే వారు బరువు ఎక్కువగా పెరుగుతారు. ఆకస్మికంగా బరువు పెరగడాన్ని గమనించినట్లయితే నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఇక ఈ సమస్యతో బాధపడే వారిలో ఆకలి వేయడం తగ్గుతుంది. వికారంగా ఉంటుంది. ఈ విధంగా ఈ లక్షణాలను గమనించిన వెంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యున్ని సంప్రదించి గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.