Heart Health : గుండె జబ్బుల సమస్యలు ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుతం యువత కూడా హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. ఎక్కువ మంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గుండెకు అనుసంధానం అయి ఉండే రక్త నాళాల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే హార్ట్ ఎటాక్ వస్తుంది. అదే గుండె కండరాలకు ఆక్సిజన్, రక్త సరఫరా సరిగ్గా జరగకపోయినా.. వాటి సరఫరా నిలిచిపోయినా.. కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఈ సమస్యనే చాలా మంది యువతలో వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు అంటున్నారు.
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 45 ఏళ్లు పైబడిన వారికి ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అతిగా మద్యం సేవించేవారు, పొగ తాగేవారు, అధిక బరువు ఉన్నవారు, హైబీపీ, డయాబెటిస్ ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అతిగా వ్యాయామం చేసినా గుండె సమస్యలు వస్తాయి.
గుండె సమస్యలు ఉన్నవారిలో పలు లక్షణాలు కామన్ గా కనిపిస్తుంటాయి. అవేమిటంటే.. ఛాతిలో నొప్పిగా లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఛాతిపై బరువు పెట్టినట్లు ఉంటుంది. ఛాతి నిండుగా బరువుగా ఉన్నట్లు, పిండుతున్నట్లు, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ కొందరికి పదే పదే వస్తుంటాయి. అలాంటి వారు వెంటనే జాగ్రత్త పడాలి.
ఇక గుండె సమస్యలు ఉన్నవారికి చెమటలు పడుతుంటాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ విపరీతమైన చెమటలు పడుతుంటే అనుమానించాలి. అలాగే కొందరికి వికారం, తలతిరగడం, చేతుల్లో నొప్పులు, వెన్నులో, మెడపై నొప్పులు వస్తుంటాయి.
గుండె సమస్యలు ఉన్నవారిలో అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించవు. భిన్నంగా ఉంటాయి. అలాగే స్త్రీ, పురుషుల్లో కనిపించే లక్షణాలు కూడా మారుతాయి. మహిళలకు ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం, వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెన్ను లేదా దవడల్లో నొప్పిగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని.. అవసరం అయితే చికిత్స తీసుకోవాలి. దీని వల్ల కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.