మధుమేహం ఘల వారందరూ టాబ్లెట్లు వాడవచ్చా? సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ గల వారందరూ టాబ్లెట్లతోనే ఆ వ్యాధిని నియంత్రించుకుంటుంటారు. సర్జరీ చేసే సమయాలలోను, లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురైనా లేక ఏదేని కారణాల వలన టాబ్లెట్ వేసుకోలేకపోతే ఇన్సులిన్ వాడాలి. టైప్ 1 డయాబెటిస్ వారు ఇన్సులిన్ తప్పక ఉపయోగించాలి. వీరు టాబ్లెట్లు ఎప్పటికీ వాడరాదు. మధుమేహానికి టాబ్లెట్లు ఎప్పటినుండి వాడాలి ? వైద్యులు టైప్ 2 డయాబెటిస్ వున్నదని పరీక్షలు చేసి నిర్ధారించిన తర్వాత కొంతకాలంపాటు అంటే సుమారు మూడు నెలలపాటు ఆహారం మార్చి మధుమేహ స్ధాయిలను పరిశీలించాలి.
ఈ చర్య మధుమేహ రోగులు ఏ రకమైన ఆహారాన్ని భుజించాలనేది కూడా రోగులకు సూచిస్తుంది. ఆహారం మార్చినప్పటికి షుగర్ లెవెల్స్ లో మార్పు లేనపుడు ఇక తప్పనిసరిగా మార్పు చేయబడిన ఆహారంతోపాటు టాబ్లెట్లను వాడటం మొదలుపెట్టాలి. మధుమేహానికి వాడే టాబ్లెట్లన్ని ఒకటిగానే వుంటాయా? కచ్చితంగా ఒకటిగా వుండవు. ఇవి వివిధ రకాల పవర్ ను కలిగి వుంటాయి. దేశంలో అనేక కంపెనీలు వివిధ రకాల పేర్లతో టాబ్లెట్లను తయారు చేస్తున్నాయి.
సుమారుగా వీటిలో 50 పేర్ల వరకు కూడా వున్నాయి. వైద్యులు రాసిన పేరుకు మీరు కొన్న టాబ్లెట్ పేరుకు సరిపడినదా లేదా చూడాలి. కొన్ని కంపెనీలు టాబ్లెట్లకు ఇన్సులిన్ పేర్లను కూడా పెడతాయి. కనుక రోగులు ఏ రకమైన డయాబెటిస్ కలిగి వున్నప్పటికి వైద్యులు రాసిన మందు చీటీలతో తాము కొన్న మందులను తప్పక సరిచూసుకోవాలి.