కరోనా అనంతరం ప్రస్తుతం చాలా మంది హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన పడి చనిపోతున్న విషయం తెలిసిందే. హార్ట్ ఎటాక్‌లు అసలు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని చాలా మంది వైద్య నిపుణులు సైతం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇది సైలెంట్ కిల్లర్‌లా వ్యాప్తి చెందుతోంది. కనుక ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే హార్ట్ ఎటాక్ వస్తే సాధారణంగా కనిపించే లక్షణం ఛాతి నొప్పి. గుండెల మీద బరువు పెట్టినట్లుగా ఉంటుంది. కానీ ఇదొక్కటి మాత్రమే కాకుండా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు పలు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండె పంపింగ్ సరిగ్గా ఉండదు. దీంతో శరీర భాగాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా ఆక్సిజన్ కూడా లభించదు. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. గుండె పోటు వచ్చిన వారిలో చాలా మందికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది గుండె పోటు యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి. అలాగే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు విపరీతంగా చెమటలు వస్తుంటాయి. ఆందోళన చెందుతారు. కంగారు పడతారు. వికారంగా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కొందరికి వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.
తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కూడా గుండె పోటు వచ్చిన వారిలో కనిపిస్తాయి. కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం అజాగ్రత్త చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏమైనా సమస్య ఉంటే ప్రాణాంతకం కాకుండా వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. ఇలా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.