Fat in Body : అధిక బరువు సమస్య కారణంగా ప్రస్తుతం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతేనే అధికంగా బరువు పెరుగుతారు. అందువల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతున్నప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే.. అధికంగా బరువు పెరగకుండా ఉంటారు. అయితే శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వల్ల అధికంగా బరువు పెరగకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. మరి ఆ లక్షణాలు ఏమిటంటే..
1. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతుంటే జీర్ణక్రియ మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అజీర్ణ సమస్య వస్తుంది. అలాగే గ్యాస్, మలబద్దకం ఇబ్బందులకు గురి చేస్తాయి. మీకు ఈ సమస్యలు సడెన్‌గా వస్తే.. మీ బరువు ఒకసారి చెక్ చేసుకోండి. దీంతో బరువు పెరుగుతుంది, లేనిదీ అర్థమవుతుంది. బరువు పెరుగుతుంటే గనక వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ముందు ముందు ఇంకా సమస్యగా మారుతుంది.
2. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే జీర్ణాశయం గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో పదే పదే త్రేన్పులు వస్తుంటాయి. కొందరికి పుల్లని త్రేన్పులు కూడా వస్తాయి. ఇది ఇంకా ఎక్కువైతే గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఈ లక్షణం గనక ఎవరిలో అయినా ఉంటే బరువు పెరుగుతున్నారో, లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
3. శరీరంలో అధికంగా కొవ్వు చేరుతున్న వారిలో కళ్ల కింద తెల్లని మచ్చలు కనిపిస్తుంటాయి. మొటిమలు వస్తాయి. శరీరంలో అక్కడక్కడా పొక్కుల మాదిరిగా బొబ్బలు వస్తుంటాయి. అవి నొప్పులకు గురవుతుంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే దాన్ని అనుమానించాల్సిందే. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలుసుకోవాలి.
4. శరీరంలో అధికంగా కొవ్వు చేరితే రక్త నాళాల్లో కొవ్వు రక్త ప్రసరణకు అడ్డు పడుతుంది. దీంతో రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఫలితంగా శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్, పోషకాలు చేరవు. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఇలా గనక ఎవరిలో అయినా లక్షణం కనిపిస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే హార్ట్ ఎటాక్‌లు సంభవించే అవకాశాలు ఉంటాయి.
5. ఛాతిలో ఉన్నట్టుండి సడెన్ గా నొప్పి వస్తుంది. కొందరికి తరచూ ఈ నొప్పి వస్తుంది. శరీరంలో కొవ్వు చేరుతుందనడానికి ఇది కూడా ఒక లక్షణమే. శ్వాస సరిగ్గా ఆడకపోతే ఛాతిలో నొప్పి మొదలవుతుంది. దీన్ని గ్యాస్ లేదా గుండె నొప్పి అనుకుంటారు. అందువల్ల ఒకసారి పరీక్షలు చేయించుకుంటే మంచిది. అలాగే బరువును కూడా చెక్ చేసుకోవాలి. బరువు పెరిగితే తగ్గి చూడాలి. దీంతో ఈ నొప్పి కూడా తగ్గుతుంది.
6. శరీరంలో అధికంగా కొవ్వు చేరితే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా లభించదు. దీని వల్ల తలనొప్పి వస్తుంది. తరచూ తలనొప్పి వస్తుంటే శరీర బరువును ఒకసారి చెక్ చేసుకోండి. సమస్య అదే అయితే బరువు తగ్గే ప్రయత్నం చేయండి.
7. శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంటే రక్త ప్రసరణ సరిగ్గా ఉండక కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. ఈ సమస్య సడెన్‌గా వస్తుంటే అనుమానించాల్సిందే.
కనుక పైన తెలిపిన లక్షణాలను ముందుగానే గుర్తిస్తే మీ శరీరంలో కొవ్వు చేరుతున్నట్లు అర్థం చేసుకోవాలి. అలాంటి వారు బరువును చెక్ చేసుకుని.. నిజంగానే బరువు పెరుగుతుంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పైన తెలిపిన లక్షణాలు అవే తగ్గిపోతాయి. లేదంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.