Hair Problems : జుట్టు రాలడం, తెల్లగా మారడం.. చుండ్రు.. వంటివన్నీ సహజంగానే ఎవరికైనా వస్తుంటాయి. ఇందుకు గాను సహజసిద్ధమైన చిట్కాలను లేదా సాధారణ షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడితే ఆ సమస్యలు తగ్గిపోతాయి. అయితే ఎన్ని రోజులు లేదా నెలలు అయినా జుట్టు సమస్యలు తగ్గడం లేదంటే.. అందుకు వేరే ఏమైనా కారణాలు అయి ఉంటాయి. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే జుట్టు సమస్యలు వస్తాయి. అవి ఒక పట్టాన తగ్గవు. ఈ క్రమంలోనే మీకు ఉండే జుట్టు సమస్యలను బట్టి మీకు ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో.. ఇట్టే తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే..
1. ఇతర జుట్టు సమస్యలు ఏవీ లేకుండా కేవలం జుట్టు మాత్రమే బాగా రాలుతుందంటే.. మీరు మానసిక ఒత్తిడి లేదా టెన్షన్, డిప్రెషన్ తో బాధపడుతున్నారని అర్థం. ఇలాంటి సమస్య తగ్గాలంటే ఒత్తిడి నుంచి బయట పడే మార్గం అనుసరించాలి. బుక్స్ చదవడం, ఇష్టమైన సంగీతం వినడం, కొంత సేపు వీడియో గేమ్స్ ఆడడం, ప్రకృతిలో గడపడం, యోగా, ధ్యానం.. వంటివి చేస్తే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది.
2. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ఒక జీవనశైలి సమస్య. దీనిని PCOS లేదా PCOD అని కూడా అంటారు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య తీవ్రమవుతుంది. ఇందులో భాగంగా మహిళలకు అండాశయంలో చిన్న గడ్డలు లేదా తిత్తులు ఏర్పడతాయి. దీంతో పీరియడ్స్ సరిగ్గా రావు. ఈ క్రమంలో స్థూలకాయం వస్తుంది. అధికంగా బరువు పెరుగుతారు. జుట్టు పొడిబారి జీవం లేకుండా మారుతుంది. జుట్టు రాలుతుంది. ఈ లక్షణాలు ఉంటే పీసీవోఎస్ నుంచి బయట పడాలి. దీంతో జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.
3. థైరాయిడ్ గ్రంథుల పనితీరు సరిగ్గా లేకపోతే థైరాయిడ్ సమస్య వస్తుంది. ఇందులో హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం.. అని రెండు రకాలు ఉంటాయి. అయితే థైరాయిడ్ ఉన్నవారిలోనూ జుట్టు సమస్యలు ఉంటాయి. జుట్టు రాలడంతోపాటు చుండ్రు కూడా బాగానే ఉంటుంది. జుట్టు పెరగదు. శరీరంపై వెంట్రుకలు పెరగవు. చిట్లినట్లు అవుతాయి. ఊడిపోతుంటాయి. ఇలా జరుగుతుంటే థైరాయిడ్‌గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని థైరాయిడ్ చికిత్స తీసుకోవాలి. దీంతో ఆటోమేటిగ్గా జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.
4. వంశ పారంపర్యంగా కొందరికి యుక్త వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. అలాగే ఒత్తిడి కారణంగా కూడా ఇలా జరుగుతుంది. కనుక ఒత్తిడి నుంచి బయట పడితే జుట్టు తెల్లబడడం తగ్గుతుంది.
5. తలస్నానం చేసినప్పుడు లేదా జుట్టు దువ్వుతున్నప్పుడు వెంట్రుకలు ఒకేసారి గుత్తిగా చేతిలోకి వస్తుంటే.. శరరీంలో రక్తం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. రక్తహీనత ఉంటే ఈ విధంగానే జరుగుతుంది. కనుక రక్తహీనత నుంచి బయట పడాలి. అందుకు డాక్టర్‌ను కలిసి ఐరన్ పిల్స్ వాడవచ్చు. లేదా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినవచ్చు. దీంతో జుట్టు ఎక్కువగా రాలే సమస్య తగ్గుతుంది.