క్యాన్సర్… చాప కింద నీరులా వచ్చే వ్యాధి ఇది. ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చినా అది వచ్చినట్టు చాలా మందికి మొదట్లో తెలియదు. తీరా ఆ వ్యాధి ముదిరే సమయంలో అప్పుడు తెలుస్తుంది. దీంతో అలాంటి పరిస్థితుల్లో ఇక చేసేదేం ఉండదు, రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. అయితే ఏ తరహా క్యాన్సర్ వచ్చినా మన శరీరంలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని కనిపెట్టడం ద్వారా ప్రాణాంతక క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. ఈ క్రమంలో క్యాన్సర్ వచ్చిన ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఏదైనా భాగంలో అదే పనిగా నొప్పి వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఉదాహరణకు ఛాతి భాగంలో నొప్పి వస్తే అది లంగ్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. అదేవిధంగా కడుపులో నొప్పి వస్తుంటే అది స్త్రీలలో అండాశయ లేదా గర్భాశయ క్యాన్సర్ అయి ఉండవచ్చు. కనుక వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే మంచిది.
తరచూ దగ్గు వస్తున్నా దాన్ని అనుమానించాల్సిందే. ఎందుకంటే అది లంగ్, త్రోట్ లేదా లారింక్స్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. కనుక తగిన పరీక్షలు చేయించుకుంటే బెటర్. మూత్రం ఎక్కువ సార్లు వెళ్తున్నా, మూత్రంలో రక్తం పడుతున్నా దాన్ని మూత్రాశయ క్యాన్సర్ గా అనుమానించాలి. లేదంటే అది కిడ్నీలు చెడిపోవడం వల్ల కూడా అయి ఉండవచ్చు. విరేచనం జరగడంలో ఇబ్బందులు ఉన్నా లేదంటే టైము తప్పి విరేచనానికి వెళ్తున్నా దాన్ని కోలన్ (పెద్ద పేగు) క్యాన్సర్ గా అనుమానించాలి. ఏ పని చేసినా, చేయకున్నా విపరీతమైన అలసట, తీవ్రమైన ఆయాసం వస్తుంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్ గా అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించి చెక్ చేయించుకోవాలి. నోట్లో నుంచి లేదా వేరే ఇతర భాగాల్లోంచి రక్తం పడుతుంటే దాన్ని కూడా క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. యోనిలో రక్తస్రావం అవుతుంటే దాన్ని సర్వికల్ క్యాన్సర్ గా మహిళలు అనుమానించాలి. అదేవిధంగా విరేచనంలో రక్తం ఉంటే దాన్ని కోలన్ లేదా రెక్టాల్ క్యాన్సర్‌గా అనుమానించాలి. ప్లీహం లో రక్తం ఉంటే దాన్ని ఊపిరి తిత్తుల క్యాన్సర్ గా అనుమానించాలి.
ఉన్నట్టుండి శరీరంలో ఎక్కడైనా చర్మం కింద పెద్ద గడ్డలుగా తయారవుతూ ఉంటే వాటిని క్యాన్సర్ గడ్డలుగా అనుమానించాలి. ఒక్కో సారి అవి సాధారణ కొవ్వు గడ్డలు అయి కూడా ఉండవచ్చు. అయినా చాన్స్ తీసుకోకూడదు. డాక్టర్ ని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. చర్మంపై ఉండే మచ్చలు సడెన్‌గా సైజ్ పెరిగినా, కలర్‌లో మార్పు వచ్చినా వాటిని స్కిన్ క్యాన్సర్ మచ్చలుగా అనుమానించాలి. వైద్యుడిని కలిసి చెక్ చేయించుకోవాలి. చిన్నపాటి గాయం లేదా దెబ్బ తాకితే కొద్ది రోజుల్లో నయమవుతుంది. అలా కాకుండా ఆ గాయం వారాల తరబడి అలాగే ఉంటే అది క్యాన్సర్ అయి ఉండవచ్చు. వెంటనే చెక్ చేయించుకోవడం బెటర్. లేదంటే అది ముదిరే అవకాశం ఉంటుంది. ఉన్నట్టుండి సడెన్ గా బరువు తగ్గుతున్నా దాన్ని క్యాన్సర్ గా అనుమానించాలి. అది పెద్ద పేగు క్యాన్సర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. డాక్టర్ ని కలిస్తే తెలుస్తుంది. తేలికపాటి ద్రవాలు లేదా ఘన ఆహారం కూడా మింగలేకపోతుంటే అది గొంతు క్యాన్సర్ అయి ఉండవచ్చు. అలాంటి స్థితి ఉన్న వారు చెక్ చేయించుకోవడం బెటర్.