Heart Attack : ప్రస్తుత తరుణంలో చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పని ఒత్తిడి, వేళకు భోజనం చేయకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, అతిగా వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయడం వంటి అంశాలతోపాటు అధిక కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ వంటి కారణాల వల్ల కూడా చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది వచ్చే వరకు ఎవరికీ తెలియదు. ముందుగా కూడా చాలా సందర్భాల్లో పసిగట్టలేం. కానీ హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కొన్ని రోజుల ముందు పలు లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కొన్ని రోజుల ముందు ఎడమ చేతిలో నొప్పి వస్తుంటుంది. ఎడమ దవడ నుంచి భుజం మీదుగా ఆ నొప్పి చేతిలోకి వ్యాప్తి చెందుతుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చిన్న పని చేసినా ఆయాసం ఎక్కువగా వస్తుంది. చెమటలు విపరీతంగా వస్తాయి. శరీరం చల్లగా మారుతుంది.
ఇక కొందరికి ఛాతిలో నొప్పి ఉంటుంది. గుండెల మీద బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. తలతిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే సంకేతాలే. కనుక వీటిని జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే స్పందించాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే ఇలా గుర్తించి జాగ్రత్త పడవచ్చు. దీంతో ప్రాణాపాయం తప్పుతుంది.