Feet : మన పాదాలను చూసి మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చని మీకు తెలుసా.. అవును.. మీరు విన్నది నిజమే. మన పాదాలను చూసి కేవలం 20 సెకన్లలలోనే మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపాలను, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా మన పాదాలను చూసి చెప్పవచ్చు. పాదాల తిమ్మిర్లు, పాదాల వేళ్లపై ఉండే వెంట్రుకలు రాలడం, పాదాలు చల్లగా మారడం, పాదాల వేళ్ల ఆకారం మారడం, పాదాలకు గాయలవ్వడం వంటి తదితర లక్షణాలను బట్టి మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలను అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలను పాదాలను చూసి ఎలా తెలుసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు సాధారణంగా పాదాల నొప్పులు, తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.
అయితే పోషకాహార లోపం, నరాల సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పాదాల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ ఆహారాలను తీసుకున్నప్పటికి తిమ్మిర్లు తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అదే విధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అవి స్ఫటికాలుగా మారి బొటన వేలులో పేరుకుపోతాయి. దీని వల్ల పాదాల్లో వాపులు, నొప్పి, ఎరుపుదనం కనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించగానే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్నా కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
అదే విధంగా డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యల కారణంగా పాదాలకు రక్తప్రసరణ తక్కువగా జరుగుతుంది. దీంతో కణాలు దెబ్బతినడం, కణాలు నశించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనిని నిక్రోసిస్ అని పిలుస్తారు. ప్రారంభంలో ఇది గాయం వలె కనిపిస్తుంది. అలాగే త్వరగా నయం కాదు. ఫలితంగా ఇవి ఇన్ఫెక్షన్ లు, గాయాల నుండి చీము కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఇటువంటి గాయాలు పాదాలపై కనబడగానే వైద్యున్నిసంప్రదించి డయాబెటిక్ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పాదాలపై ఉండే వెంట్రుకలు బలహీనపడిన లేదా పాదాలపై ఉండే వెంట్రుకలు రాలిపోయిన రక్తప్రసరణ సాఫీగా సాగడం లేదని అర్థం చేసుకోవాలి. రక్తనాళాల్లో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం రక్తనాళాలు గట్టిపడి క్రమంగా కుచించుకుపోతాయి. దీంతో గుండె పాదాల వరకు రక్తాన్ని సరఫరా చేయలేకపోతుంది.
దీంతో పాదాలపై ఉండే వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఈ లక్షణం కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా సక్రమంగా లేకపోవడం వల్ల పాదాలు చల్లబడడం, చర్మం పొడిగా మారడం, వెర్టిగో వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక వెంటనే థైరాయిడ్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ధూమపానం, అధిక రక్తపోటు, రక్తప్రసరణ సాఫీగా సాగకపోవడం వంటి వాటి కారణంగా కూడా పాదాలు చల్లబడతాయి. అలాగే శరీరంలో ధమనులకు సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా పాదాల్లో తిమ్మిర్లు, నొప్పి వస్తూ ఉంటాయి. కనుక ఎప్పటికప్పుడు పాదాలను పరీక్షించుకుంటూ ఉండాలి. పైన తెలిపిన వాటిల్లో ఏ లక్షణం కూడా ఉన్నా కూడా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.