Kidney Stones : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. నీటిని తక్కవుగా తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు, ఉప్పు, మినరల్స్ మూత్రపిండాల్లో పేరుకుపోయి చిన్న చిన్న స్ఫటికాలుగా మారతాయి. క్రమంగా అవి రాళ్ల లాగా మారతాయి. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి ఉంటుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. మూత్రపిండాల్లో ఉండే రాళ్లు క్రమంగా మూత్రాశయంలోకి మూత్రనాళాల్లోకి వచ్చి నొప్పితో పాటు ఇతర ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది.
మూత్రపిండాల్లో రాళ్లు కూడా వివిధ పరిమాణంలో ఉంటాయి. కొన్నిసార్లు మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్టు కూడా మనకు తెలియదు. రాళ్లు చిన్నగా ఉండే వాటి వల్ల ఎటువంటి నొప్పి ఉండదు. ఇలా చిన్న పరిమాణంలో ఉండే రాళ్లు మూత్రం ద్వారా కూడా బయటకు తొలగిపోతాయి. రాళ్లు చిన్నగా ఉన్నాయి కదా వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే అవి మరింత పెద్దగా తయారయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లు తీవ్రమైన నొప్పిని, మరిన్ని తీవ్రమైన ఇబ్బందులను కలిగిజేస్తాయి.
మూత్రపిండాల్లో రాళ్ల లక్షణాలు.. వాటిని ఎలా గుర్తించాలి..
మూత్రపిండాల్లో రాళ్లు చిన్నగా ఉంటే వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు అలాగే ఎటువంటి లక్షణాలు కూడా కనిపించవు. ఈ రాళ్లు మూత్రాశయంలోకి, మూత్రనాళాల్లోకి వెళ్లి ఇరుక్కున తరువాత మాత్రమే నొప్పి కలుగుతుంది. అలాగే వీటి కారణంగా పొత్తి కడుపులో నొప్పి, నడుము భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం, మూత్రంలో చీము రావడం, జ్వరం, వాంతులు, చలి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రపిండాల్లో మరీ పెద్ద పరిమాణంలో రాళ్లు ఉంటే మూత్రపిండాలు ఉబ్బి మరింత నొప్పిని కలిగిస్తాయి. వీటిని వెంటనే తగినంత చికిత్స తీసుకోకపోతే మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణాలు..
పెద్ద వారిలోనే కాకుండా యువత, పిల్లల్లో కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. నీటిని తక్కువగా తీసుకోవడమే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. అలాగే ఊబకాయం, శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగకపోవడం, మధుమేహం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, మన ఆహారపు అలవాట్లు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు ఎక్కువగా వాడడం వంటి అనేక కారణాల చేత మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి.
మూత్రపిండాల్లో రాళ్లకు ఎటువంటి చికిత్స తీసుకోవాలి…
మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణానాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల చిన్న పరిమాణంలో ఉండే రాళ్లు మూత్రం ద్వారా బయటకు పోతాయి. పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లను తొలగించడానికి మాత్రం శస్త్రచికిత్స ఒక్కటే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే ఊబకాయం సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే చక్కటి జీవన విధానాన్ని అవలంబించాలి. అదే విధంగా బెసిల్, సెలెరీ, ఆపిల్స్, ద్రాక్ష పండ్లు వంటి మూత్రపిండాలకు మేలు చేసే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఈ సమస్య బారిన పడకుండా ఉంటాము.