Lung Cancer : ప్రస్తుతం ప్రపంచంలో పొగాకు ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారతదేశం మూడవ స్థానంలో ఉండగా, పొగాకు వాడకంలో రెండవ స్థానంలో ఉంది. మన దేశ జనాభాలో 28.6 శాతం ప్రజలు పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు. వారిలో 42.4 శాతం పురుషులు కాగా 14.2 శాతం స్త్రీలు ఉన్నారు. ఇక మన దేశంలో దాదాపుగా 26.7 కోట్ల మంది ప్రజలు పొగాకు వాడుతున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో 27 శాతం క్యాన్సర్లు పొగాకు వాడకం వల్లనే సంక్రమిస్తున్నాయని తెలుస్తోంది. అయితే పొగాకు వలన వచ్చే క్యాన్సర్ రకాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా ఉంటుందని వివిధ రకాల పరిశోధనలు చెబుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో 22.6 లక్షల మంది ఊపిరి తిత్తుల క్యాన్సర్ బారిన పడినట్టు తెలుస్తోంది.
ఇక ఊపిరి తిత్తుల క్యాన్సర్ రావడానికి గల ముఖ్య కారణాల్లో పొగ తాగడం మొదటిది. రోజులో ఎన్ని ఎక్కువ సిగరెట్లు, బీడీలు కాలిస్తే అంత తొందరగా క్యాన్సర్ సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఏ వయసులోనైనా సరే పొగ తాగే అలవాటును మానుకోవడం వలన క్యాన్సర్ కణాలు వృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మన దగ్గర్లో ఉన్న ఇతరులు పొగ తాగినప్పుడు దానిని మనం పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ సోకే అవకాశాలు ఉంటాయి. ఇతర రకాల క్యాన్సర్ లకి వైద్యంలో భాగంగా చేసే రేడియేషన్ థెరపీ వలన కూడా ఊపిరి తిత్తుల క్యాన్సర్ సోకవచ్చు. అంతే కాకుండా పని ప్రదేశాల్లో ఆస్బెస్టాస్, యురేనియం, క్రోమియం, నికెల్ లాంటి కాన్సర్ కారకాలకు గురైనపుడు కూడా లంగ్ కాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.
ఈ ఊపిరితిత్తుల కాన్సర్ వలన కలిగే లక్షణాలలో దగ్గు ముఖ్య మైనది. దీని వలన విపరీతమైన దగ్గు రావడం మనం చూడవచ్చు. ఇది ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గదు. ఈ కాన్సర్ సోకిన వారిలో 20 నుండి 60 శాతం వరకు రోగులకు దగ్గినపుడు రక్తం రావడం కూడా మనం గమనించవచ్చు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పక్కటెముకలలో, ఛాతిలో నొప్పిగా ఉంటుంది. ఇంకా బరువు తగ్గడం, ఎముకల్లో నొప్పులు, తల నొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ లో 2 రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి చిన్న కణాల క్యాన్సర్ అనగా ఇది పొగ తాగడం వలన వచ్చేది కాగా రెండోది వేరే కారకాల వలన వచ్చేది. ఇక ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ముందుగా పొగ తాగడం మానుకోవాలి. దీని కోసం ఒత్తిడికి లోనవకుండా ఉండాలి. యోగా చేయడం, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. పొగ తాగడం వలన కలిగే నష్టాలను పిల్లలకు కూడా వివరించి చెప్పాలి. పొగ తాగే వాళ్లకు కూడా దూరంగా ఉండాలి. పని ప్రదేశాల్లో కాన్సర్ కారక రసాయనాలకు గురి కాకుండా ఉండేందుకు ముఖానికి మాస్కులు, చేతులకి తొడుగులు ధరించాలి.
తాజా పండ్లు, కూరగాయలకు మనం తీసుకునే ఆహారంలో ప్రాధాన్యం ఇవ్వాలి. వారంలో వీలైనంత ఎక్కువ రోజులు వ్యాయామానికి సమయం కేటాయించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.