Mouth Cancer Symptoms : నోటి క్యాన్సర్. దీన్నే Mouth cancer అని, oral cancer అని కూడా అంటారు. దేశంలో ప్రస్తుతం ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఈ క్యాన్సర్ నోట్లో ఏ పార్ట్‌కు అయినా సరే రావచ్చు. పెదవులు, నాలుక, చిగుళ్లు, బుగ్గల లోపలి వైపు, గొంతులో.. ఇలా నోట్లో ఈ క్యాన్సర్ ఎక్కడైనా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడ వచ్చినా నోటి క్యాన్సర్ అనే అంటారు. ఈ క్యాన్సర్ వచ్చిన ఆరంభంలో పెద్దగా లక్షణాలు, సంకేతాలు ఏమీ కనిపించవు. చిన్న చిన్న సీజనల్ వ్యాధులు వస్తాయి. దీంతో అవి కామనే కదా అని చాలా మంది అంతగా పట్టించుకోరు.
వాస్తవానికి నోటి క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పవచ్చు. దీన్ని ముందు స్టేజ్‌లోనే గుర్తించవచ్చు. దీంతో విజయవంతంగా చికిత్స తీసుకోవచ్చు. అయితే నోటి క్యాన్సర్ వచ్చిన కొత్తలో మన శరీరం పలు లక్షణాలను, సంకేతాలను ఇస్తుంది. వాటిని ముందుగానే గుర్తించడం ద్వారా డాక్టర్ ను కలసి పరీక్షలు చేయించుకుని, క్యాన్సర్ అని తేలితే త్వరగా చికిత్స తీసుకోవచ్చు. దీంతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇక నోటి క్యాన్సర్ వచ్చిన వారిలో ఆరంభంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
నోట్లో పూతలు లేదా పొక్కుల వంటి గుల్లలు 2 వారాలకు మించి అలాగే ఉంటే వాటిని నోటి క్యాన్సర్‌గా అనుమానించాలి. అలాగే నోట్లో నాలుక లేదా నోరు కింది భాగంలో స్పర్శ లేనట్లు ఉంటుంది. కొన్ని సార్లు సూదులతో గుచ్చినట్లు కూడా ఉంటుంది. నోట్లో లేదా నాలుకపై ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడుతుంటే అవి నోటి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నోట్లో లేదా గొంతులో, నాలుక కింద, బుగ్గల లోపలి వైపు కణతులు ఏర్పడి నొప్పిగా ఉంటున్నా కూడా వాటిని నోటి క్యాన్సర్‌గా అనుమానించాలి.
నోటి క్యాన్సర్ ఉన్నవారికి ఏం తినాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. నోటి క్యాన్సర్ మాత్రమే కాకుండా ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గిపోతారు. ఇలా జరిగిందేమో చూడండి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గి సీజనల్ వ్యాధులు పదే పదే వస్తుంటాయి. ఇలా జరుగుతున్నా కూడా క్యాన్సర్‌గా అనుమానించాలి. అయితే ఇది రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అందుకు గాను తంబాకు నమలడం లేదా పొగ తాగడం మానేయాల్సి ఉంటుంది. నోటి క్యాన్సర్ వచ్చేందుకు ఇవే రెండు పెద్ద కారణాలు. కనుక ఈ అలవాట్లను వెంటనే మానేయాలి. లేదంటే ప్రాణాంతకం అవుతుంది. అలాగే మద్యం సేవించడం కూడా నోటి క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతుంది. కనుక దీన్ని కూడా మానేయాల్సి ఉంటుంది.
డైట్లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తీసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. తేలికపాటి వాకింగ్ అయినా చేయాలి. తరచూ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఈ సూత్రాలను పాటిస్తే నోటి క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.