మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా.. అన్ని రకాల విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నా.. అందుకు ప్రోటీన్లు ఎంతో అవసరం అవుతాయి. ప్రోటీన్ల వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. కండరాల నిర్మాణం జరిగి ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* కొందరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం లేదని దిగులు చెందుతుంటారు. అయితే ప్రోటీన్ల లోపం ఉంటే ఇలాగే జరుగుతుంది. కనుక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో బరువు కూడా తగ్గుతారు.
* ప్రోటీన్ల లోపం మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీంతో మూడ్ మారుతుంది. సంతోషంగా ఉండలేరు. ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే ప్రోటీన్ల లోపం ఉందేమో గమనించాలి.
* ప్రోటీన్లు తగినంతగా లేకపోతే శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోతాయి. దీంతో ఆకలి బాగా అవుతుంది. ఇలా జరుగుతుంటే ప్రోటీన్ల లోపం ఉందేమోనని చెక్ చేసుకోవాలి.
* ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డితోపాటు ప్రోటీన్లు కూడా అవసరమే. ప్రోటీన్లు లోపించడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. నొప్పులు వస్తుంటాయి.
* ప్రోటీన్ల లోపం ఉంటే చర్మం ఎర్రగా కనిపిస్తుంది. పొలుసులుగా చర్మం ఊడి వస్తుంది. వెంట్రుకలు పలుచబడతాయి. జుట్టు రాలుతుంది. గోళ్లు పగిలిపోతాయి. చర్మం ఉబ్బిపోయి కనిపిస్తుంది.
ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే దాన్ని ప్రోటీన్ల లోపంగా భావించాలి. వెంటనే ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవడం ప్రారంభించాలి. మనకు ఒక కిలో శరీర బరువుకు సుమారుగా 1-1.5 గ్రాముల ప్రోటీన్లు అవసరం అవుతాయి. అంటే 60 కిలోలు ఉన్న వ్యక్తికి రోజూ 60 నుంచి 90 గ్రాముల ప్రోటీన్లు కావాలి. ఇలా మన శరీర బరువుకు తగినట్లు రోజూ ప్రోటీన్లను తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులు, సోయా వంటి ఆహారాల్లో లభిస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే ప్రోటీన్ల లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.