మన శరీరానికి కావల్సిన స్థూల పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. ఇవి మన శరీరానికి శక్తిని అందించడంతోపాటు శరీర నిర్మాణానికి, కండరాల పనితీరుకు ఉపయోగపడతాయి. శాకాహారాలు లేదా మాంసాహారులు ఎవరైనా సరే ప్రోటీన్లు ఉన్న ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీని వల్ల పోషణ లభిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శాకాహారులకు అయితే తృణ ధాన్యాలు, నట్స్, విత్తనాలు, సోయా ఉత్పత్తులు, పాలకూర, పచ్చి బఠానీలు వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి. మాంసాహారులు అయితే గుడ్లు, మాంసం, చేపలు, చికెన్ ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి. ఇవేకాకుండా పాలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసుల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను రోజూ తినాలి. దీంతో ప్రోటీన్ల లోపం ఏర్పడకుండా ఉంటుంది.
అయితే ప్రోటీన్లను సరిగ్గా తీసుకోకపోతే శరీరం పలు లక్షణాలను చూపిస్తుంది. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటంటే…
1. ప్రోటీన్లను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో శారీరక శ్రమ ఎక్కువగా చేయగలుగుతారు. అయితే ప్రోటీన్ల లోపం వస్తే శరీరానికి తగినంతగా శక్తి లభించదు. దీంతో నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తుంది. చిన్న పనికే బాగా అలసి పోతారు.
2. ప్రోటీన్లను తగినంతగా తీసుకుంటే కండరాలు, కణాల నిర్మాణం జరుగుతుంది. ప్రోటీన్ల లోపం ఏర్పడితే కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు చిక్కిపోయి కనిపిస్తాయి. బలం లేకుండా అయిపోతారు. బరువులు ఎత్తలేరు.
3. ప్రోటీన్ల లోపం ఉన్నవారికి బాగా ఆకలి అవుతుంటుంది. శరీరానికి తగినంతగా శక్తి లభించదు కనుక శరీరం ఆహారం తీసుకోవాలని చెబుతుంది. అందుకనే సూచనగా ఆకలి అయ్యేలా చేస్తుంది.
4. ప్రోటీన్ల లోపం ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో వారు త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. వ్యాధులు సోకితే త్వరగా కోలుకోలేరు.
5. ప్రోటీన్ల లోపం ఉంటే చర్మం త్వరగా ముడతలు పడుతుంది. యుక్త వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చినట్లు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా ప్రోటీన్ల లోపం ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించాలి. దీంతో ఆ లోపం నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365