Heart Attack Signs : ప్రస్తుతం చాలా మంది హార్ఠ్ ఎటాక్‌తో చనిపోతున్నారు. చిన్న పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మనం ఇట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ టీకాల వల్లే ఇదంతా జరుగుతుందని చాలా మంది అంటున్నారు. అయితే దీని వెనుక వాస్తవాలు ఏమున్నప్పటికీ హార్ట్ ఎటాక్‌లు ఈ మధ్య ఎక్కువయ్యాయన్న నిజాన్ని మాత్రం మనం గమనించాలి. కనుక మన గుండెను మనం సంరక్షించుకోవాల్సి ఉంటుంది.
గుండె పోటు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అస్తవ్యస్తమైన జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్లు, నిత్యం ఒకే చోట కూర్చుని గంటల తరబడి పనిచేయడం, వేళకు భోజనం చేయకపోవడం, నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం.. వంటివి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. అలాగే ధూమపానం ఎక్కువగా చేసేవారిలోనూ హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. మద్యపానం కూడా ఇందుకు కారణం అవుతోంది. అయితే కొన్ని రకాల లక్షణాలను మాత్రం మీలో కనిపిస్తున్నాయంటే అవి గుండె పోటు వచ్చేందుకు సంకేతాలని భావించాలి. ఇక ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటుంది..
గుండెపోటుకు ముందు లేదా గుండె పోటుకు గురైన సమయంలో, మరీ ముఖ్యంగా మహిళల్లో వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటుంది. దవడలోకి నొప్పి ప్రసరిస్తూ ఉంటే పంటి నొప్పి లేదా కండరం నొప్పి అని సరిపెట్టుకోకుండా గుండెపోటుగా అనుమానించాలి. అలాగే గుండె కండరానికి రక్త సరఫరా జరిగే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ అసౌకర్యం ఛాతిలోనే మొదలైనా నొప్పి మెడలోకి కూడా ప్రసరించవచ్చు. మెడ పట్టేసినా, మెడ కండరాలు అలసట, ఒత్తిడికి లోనైనా కూడా మెడ నొప్పి రావచ్చు. అయితే అది గుండె పోటు లక్షణం కూడా కావచ్చనే విషయాన్ని మరువకూడదు.
నొప్పి ఎడమ చేతిలో ఉంటే..
గుచ్చుకున్నట్లు ఛాతిలో మొదలయ్యే నొప్పి మెడ నుంచి దవడ వైపు, భుజంలోకి ప్రసరించడం గుండెపోటు లక్షణం. భుజం నొక్కేసినట్లు నొప్పి మొదలైనా, ఆ నొప్పి ఛాతి నుంచి ఎడమ దవడ, చేయి, మెడ వైపుకు ప్రసరించినా నిర్లక్ష్యం చేయకూడదు. చేతుల్లో తేలికపాటి నొప్పులు వయస్సు పైబడిన వాళ్లలో సహజమే. అయితే హఠాత్తుగా అసహజమైన నొప్పి ఎడమ చేతిలో మొదలైతే గుండె పోటుగా భావించి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.