అధిక బరువు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అనేక కారణాల వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే అధిక బరువు పెరగడం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి.. అతిగా తినడం. అతిగా తింటే చాలా మంది బరువు పెరుగుతారు. కొందరు పెరగరు. అందుకు వారి జన్యువులు కారణం అవుతాయి. ఇక బరువు పెరగడం వెనుక ఉన్న పలు ఇతర కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇన్‌స్టంట్ నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, కొవ్వులు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తింటే బరువు పెరుగుతారు. బరువు పెరిగేందుకు ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి.
2. మహిళల్లో అయితే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్) అనే సమస్య కారణంగా హార్మోన్ల అసమతుల్యతలు ఏర్పడి వారు బరువు పెరుగుతుంటారు. సహజంగానే 40-80 శాతం మంది మహిళలు ఇందువల్లే బరువు పెరుగుతుంటారు. అలాగే థైరాయిడ్ సమస్య వల్ల కూడా చాలా మంది బరువు పెరుగుతుంటారు.
3. రోజూ కూర్చుని పనిచేయడం, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
4. వంశ పారంపర్యంగా కూడా కొందరు బరువు పెరుగుతుంటారు. కుటుంబంలో ఎవరైనా బరువు అధికంగా ఉంటే వారి పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా బరువు పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి.
5. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారు కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే వారిలో ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. అవి ఆకలి కలిగేలా చేస్తాయి. దీంతో అధికంగా ఆహారం తింటారు. ఫలితంగా బరువు పెరుగుతారు.
కనుక బరువు పెరుగుతున్నాం అంటే.. కేవలం తిండి వల్లే అని అనుకోవాల్సిన పనిలేదు. తిండి అస్సలు తినకున్నా కొందరు పైన తెలిపిన కారణాల వల్ల బరువు పెరుగుతుంటారు. కనుక సరైన కారణం తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే దాంతో అధికంగా బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది.