సాధారణంగా మనలో చాలా మందికి కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో చెమట పోస్తుంటుంది. శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసినా లేదంటే.. ఉక్కపోత ఉన్న వాతావరణంలో గాలి తగలకుండా ఎక్కువ సేపు ఉన్నా, ఎండలో ఉన్నా చెమట పోయడం సర్వ సాధారణం. అయితే ఇదే కాకుండా పలు అనారోగ్య సమస్యలు ఉన్నా చెమట పోస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల లేదంటే శరీర జీవక్రియల వల్ల కూడా చాలా మందికి చెమట పోస్తుంది. కానీ దీని గురించి దాదాపుగా ఎవరికీ తెలియదు. అయితే ఏయే సందర్భాల్లో ఇలా చెమట వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి జీవక్రియలను నియంత్రిస్తుందని అందరికీ తెలిసిందే. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అయితే కొన్ని సార్లు థైరాయిడ్ మరీ బాగా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో, దాని కోసం మెడిసిన్ వేసుకునే వారిలోనూ థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసి శరీరాన్ని చల్లగా మార్చేందుకు మనకు చెమట పోస్తుంది. అలాగే అతిగా చెమటలు రావడం వెనుక ఉన్న మరో కారణం.. నరాల వ్యవస్థ దెబ్బ తినడం. ఇందు వల్ల కూడా కొందరిలో చెమటలు విపరీతంగా వస్తుంటాయి.
మధుమేహం సమస్య దీర్ఘకాలికంగా ఉంటే అలాంటి వారిలో డయాబెటిక్ న్యూరోపతి, వెన్నెముక దెబ్బ తినడం, నరాల మీద దుష్ప్రభావం పడడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో వారికి విపరీతంగా చెమట పోస్తుంటుంది. అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్లు బాగా ఏర్పడినా చెమట పోస్తుంది. దీంతోపాటు ఇలాంటి వారికి జ్వరం కూడా ఉంటుంది. ఇక కొందరు మధుమేహం కంట్రోల్ అవడం కోసం మెడిసిన్ వాడుతారు. అలాంటి వారిలో ఇన్సులిన్ మోతాదు పెరిగితే అప్పుడు షుగర్ బాగా తగ్గి చెమటలు పోస్తాయి. అయితే ఇవేవీ తెలియని కొందరు మాత్రం వేసవి కదా, అందుకే చెమటలు పోస్తున్నాయి అనుకుని భ్రమ పడుతుంటారు. కనుక ఎవరికైనా విపరీతంగా చెమటలు పోస్తుంటే వారు పైన చెప్పిన సమస్యలున్నాయేమో ఓసారి చెక్ చేయించుకోవాలి. డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకుని మందులు వాడాలి. అంతేకానీ అతిగా చెమటలు పోస్తుంటే అలా ఊరికే వదిలేయకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది.