Varicose Veins : ప్రస్తుత కాలంలో వెరికోస్ వీన్స్ అనే సమస్యను చాలా మందిలో కనిపిస్తోంది. కాళ్లల్లో , పాదాలల్లో ఉండే రక్త నాళాలు ఉబ్బి నీలం రంగులో మెలికలు తిరిగినట్టుగా ఉండడాన్ని వెరికోస్ వీన్స్ అంటారు. అధికంగా బరువు ఉండడం, ఎక్కువగా కాళ్లను కిందికి వేసి కూర్చోవడం, వ్యాయామం చేయక పోవడం.. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కాళ్లల్లో రక్త నాళాలు బలంగా తయారవుతాయి. ఎటువంటి వ్యాయామం చేయకుండా ఎక్కువ సమయం కూర్చొని ఉండే వారిలో కాళ్లల్లో ఉండే రక్త నాళాలు బలహీనంగా ఉంటాయి.
రక్త నాళాలు బలహీనంగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ సాఫీగా జరగదు. దీని వల్ల రక్త నాళాలలో రక్తం నిల్వ ఉండి వెరికోస్ వీన్స్ కు దారి తీస్తుంది. అధికంగా బరువు ఉండడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల రక్త నాళాలు బలహీన పడి రక్త సరఫరా జరగక వెరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే రక్త నాళాలలో రక్తం నిల్వ ఉండకుండా రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేయాలి. దీని కోసం మనం పడుకునేటప్పుడు మన కాళ్ల కింద ఎత్తు ఉండేలా చూసుకోవాలి.
మన కాళ్ల కింద దిండును పెట్టుకోవడం కానీ లేదా మనం పడుకునే మంచం కింద కాళ్ల వైపు ఎత్తు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త సరఫరా సాఫీగా జరిగి వెరికోస్ వీన్స్ సమస్య తగ్గుతుంది. ఈ సమస్య ఉన్న వారు తరుచూ కాళ్లను ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. కాళ్లను పైకెత్తి చేసే యోగాసనాలు కూడా ఈ సమస్య తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. వెరికోస్ వీన్స్ సమస్య ప్రారంభ దశలో ఉన్న వారు ఇలా చేయడం వల్ల సమస్య తీవ్రంగా అవ్వదు. అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గే వ్యాయామాలు చేయడంతో పాటు ప్రతి రోజూ తొడలకు, పాదాలకు సంబంధించిన వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం వల్ల కాళ్లల్లో ఉండే రక్త నాళాలు బలంగా తయారవుతాయి. దీంతో ఈ సమస్య నుండి బయట పడడంతోపాటుగా భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉంటుంది.