Kidneys : మనలో ఉండే రెండు మూత్రపిండాలు మనలో ఉండే 5 లీటర్ల రక్తాన్ని రోజుకు రెండు సార్లు వడపోస్తూ ఉంటాయి. రక్తంలో ఉండే వ్యర్థాలను, రసాయనాలను, మలినాలను, టాక్సిన్లను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా పని చేసేటప్పుడు వాటి విలువ మనకు తెలియదు. వాటి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోము. మూత్రపిండాలు వైఫల్యం చెంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే కానీ మనకు వాటి విలువ అర్థం కాదు. 150 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకం రాకుండా మూత్రపిండాలు పనిచేసేలా వాటి నిర్మాణం జరిగి ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిలో వయసు రాకుండానే మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నాయి.
అసలు మూత్రపిండాలు వైఫల్యం చెందడానికి ప్రధాన కారణాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో మూత్రపిండాలు చెడిపోతూ ఉంటాయి. శరీరంలో ఎక్కువైన చక్కెరను వడకట్టి వడకట్టి మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నాయి. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో 100 కి 40 శాతం మూత్రపిండాలు వైఫల్యం చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటు కారణంగా కూడా మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి. హైబీపీ కారణంగా మూత్రపిండాలకు అయ్యే రక్తసరఫరా తగ్గడంతో మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి. అదే విధంగా కొన్ని రకాల వైరస్, బాక్టీరియాలు మూత్రపిండాల్లో చేరి వాటి పనితీరును దెబ్బతీస్తూ ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు, హైబీపీతో బాధ పడే వారు సంవత్సరానికి ఒక్కసారైనా మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
మూత్రపిండాలు చెడిపోయిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే వాటి పనితీరును తెలుసుకుని ముందుగానే జాగ్రత్త పడడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన మూడు లేదా నాలుగు చిన్న చిన్న పరీక్షలను చేయించుకోవడం వల్ల వాటి పనితీరును మనం తెలుసుకోవచ్చు. ముందుగా మూత్రం పరీక్ష చేయించుకోవాలి. మూత్ర పరీక్షలో ఆల్బుమిన్ అనేది నిల్ అని వస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం. అలాగే ఆల్బుమిన్ కొద్దిగా ఉన్నాయని వస్తే వైద్యుని సలహా తీసుకోవాలి. అలాగే ఆల్బుమిన్ కనుక 1 ప్లస్, 2 ప్లస్ అని వస్తే మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభమైనదని అర్థం. ఇలా మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉప్పు తీసుకోవడం మానేసి ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని మార్చుకుంటే మూత్రపిండాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.
అలాగే మూత్రపిండాల పనితీరును తెలియజేసే పరీక్షలు, మూత్రపిండాలు వడకట్టే రేటును తెలియజేసే జి ఎఫ్ ఆర్ పరీక్షలను చేయించుకోవాలి. మూత్రపిండాలు వడకట్టే రేటు 90 గా వస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నట్టు, అలాగే 60 నుండి 90 మధ్యలో వస్తే సాధారణంగా ఉన్నట్టు, 60 కంటే తక్కువగా ఉంటే మూత్రపిండాల్లో సమస్య ఉన్నట్టు అలాగే 15 కంటే తక్కువగా ఉండే మూత్రపిండాలు పూర్తిగా వైఫల్యం చెందాయని అర్థం. ఈ పరీక్షలల్లో ఎటువంటి తేడా గమనించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రపిండాలు పూర్తిగా వైఫల్యం చెందిన తరువాత బాధపడడం కంటే ముందుగానే తగిన ఆహార నియమాలు పాటిస్తూ వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.