ఇటీవలి కాలంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో అధిక రక్తపోటు ఒకటి. గుండె ఆరోగ్యంలో రక్తపోటు పాత్ర కీలకం. బ్లడ్ ప్రెజర్ తగ్గినా, పెరిగినా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే బీపీని నార్మల్‌గా మెయింటెన్ చేయాలి. అయితే జీవనశైలి మార్పులతో ఇటీవల కాలంలో చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఊబకాయం, ఉప్పు వినియోగం పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, హెల్తీ ఫుడ్ తినకపోవడం వంటివి హై బీపీకి కారణాలు.అధిక రక్తపోటు కారణంగా రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది.
ధమనుల గోడలపై రక్తం చూపించే ఫోర్స్‌ను రక్తపోటుగా కొలుస్తారు. బ్లడ్ ప్రెషర్ ఫోర్స్ సాధారణ పరిధి (120/80)కి మించి 180/120 మిల్లీమీటర్ల మెర్క్యూరీ వరకు పెరిగితే హైపర్‌టెన్సివ్ క్రైసిస్ వస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు హృదయనాళ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా శరీరంలో అధిక రక్తపోటు ఉందనే విషయాన్ని తీవ్రమైన తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, యాంగ్జైటీ, ఛాతి నొప్పి వంటి కొన్ని సంకేతాలు తెలుపుతాయి.
ముఖ్యంగా హైపర్ టెన్షన్(హై బీపీ)తో బాధపడుతున్న వ్యక్తులు పోషకాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హై బీపీకి వైద్యుల సూచన మేరకు కొన్ని మందులు వాడుతున్నప్పటికీ, వాటితో పాటు ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. బీపీ ఎక్కువైతే పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దీని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. అధిక రక్తపోటుతో తలనొప్పి, తలతిరగడం, దృష్టిలోపం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు హైబీపీ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బీపీని ఎల్లప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ముందుగానే గుర్తించడానికి, మందుల విషయంలో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.