Yawning : మన శరీరం రోజూ ఎన్నో విధులను నిర్వర్తిస్తుంటుంది. వాటిల్లో కొన్ని మనకు తెలుస్తుంటాయి. కానీ కొన్ని మాత్రం తెలియవు. ఇక మనకు తెలిసి జరిగే విధుల్లో ఆవులింతలు కూడా ఒకటి. ఆవులింత అనేది ఒక సాధారణ జీవక్రియ. ఆవులింతలు మనకు తరచూ వస్తూనే ఉంటాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 5 నుంచి 10 సార్లు ఆవులింతలు తీస్తారు. అయితే ఇంతకు మించితే మాత్రం జాగ్రత్త పడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఆవులింతలు మరీ విపరీతంగా వస్తుంటే అందుకు అనేక కారణాలు ఉంటాయని అంటున్నారు. ఇక ఆవులింతలు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవులింతలు అనేవి రకరకాల కారణాల వల్ల వస్తుంటాయి. ఎదుటి వ్యక్తి ఆవులిస్తున్నా మనకు ఆవులింత వస్తుంది. ఇది సహజసిద్ధమైన చర్య. అయితే కొన్ని ఇతర కారణాల వల్ల కూడా మనకు ఆవులింతలు వస్తుంటాయి. నిద్ర తక్కువైనా, డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉన్నా, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేకపోయినా, షుగర్ లెవల్స్ తగ్గినా.. ఆవులింతలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక అవసరం అయిన దానికన్నా ఎక్కువ మోతాదులో నిద్రించినా లేదా ఆలస్యంగా నిద్రించి ఆలస్యంగా మేల్కొన్నా కూడా ఆవులింతలు వస్తుంటాయి.
విపరీతంగా అలసిపోయినా, శారీరక శ్రమ ఎక్కువైనా కూడా ఆవులింతలు వస్తుంటాయి. బోర్ కొడుతున్నప్పుడు, విసుగు, చిరాకు ఉన్నప్పుడు కూడా ఇవి వస్తాయి. అయితే ఈ కారణాలు మాత్రమే కాకుండా పలు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆవులింతలు వస్తాయి. లివర్ వ్యాధులు, నాడీ మండల సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా విపరీతంగా ఆవులింతలు వస్తుంటాయి. అయితే పైన చెప్పిన కారణాలు కాకుండా ఇంతకు ముందు చెప్పిన కారణాల వల్లే ఆవులింతలు ఎక్కువగా వస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఒక్కోసారి ఈ విషయం మనకు తెలియదు. కనుక ఆవులింతలు మరీ ఎక్కువగా వస్తుంటే.. అది ఒకటి రెండు రోజులు అయినా కూడా తగ్గకపోతే.. అప్పుడు తప్పక జాగ్రత్త పడాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు మరింత ముదిరే అవకాశాలు ఉంటాయి. కనుక ఆవులింతలు ఎక్కువగా వస్తుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. లేదంటే ప్రమాదం ఏర్పడుతుంది.