మన శరీరం అనారోగ్యం బారిన పడినప్పుడు బయటకు కొన్ని లక్షణాలను చూపిస్తుంది. వాటిని గమనించడం ద్వారా మనకు వ్యాధి వచ్చిందని మనం సులభంగా తెలుసుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు కలిగే అనారోగ్య సమస్యలను గుర్తించడానికి వైద్యులు మూత్ర పరీక్ష చేస్తుంటారు. దీంతో మనకు వచ్చిన వ్యాధి ఏమిటనేది వారికి సులభంగా తెలిసిపోతుంది. అందుకు తగిన విధంగా వారు మనకు చికిత్సను అందిస్తారు.
అయితే మనం విసర్జించే మూత్రం రంగును బట్టి మనకు ఏయే అనారోగ్య సమస్యలు వచ్చాయో మనం కూడా సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే..
1. మూత్రం ఎరుపు రంగులో వస్తుంటే తీవ్ర అనారోగ్య సమస్య వచ్చిందని అర్థం చేసుకోవాలి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చినా, కిడ్నీ స్టోన్లు ఉన్నా, మూత్రాశయంలో ట్యూమర్లు ఏర్పడినా ఇలా మూత్రంలో రక్తం వస్తూ మూత్రం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే ప్రోస్టేట్ గ్రంథిలో అసాధారణ రీతిలో మార్పులు వచ్చినా ఈ విధంగా మూత్రం ఎర్రగా కనిపిస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో మెర్క్యురీ అనే లోహం శరరీంలో ప్రవేశించి పాయిజనింగ్ అవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కనుక మూత్రం ఎరుపు రంగులో వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
2. వివిధ రకాల ఆహారాలను తిన్నప్పుడు మూత్రం ఆకుపచ్చ లేదా బ్లూ కలర్‌లో వస్తుంది. అలాగే కీమోథెరపీ మందులను వాడుతుంటే మూత్రం నారింజ రంగులో వస్తుంది. క్యారెట్లను అధికంగా తింటే మూత్రం లైట్ ఆరెంజ్ కలర్‌లో వస్తుంది. విటమిన్ సి ని అధికంగా తీసుకున్నా కూడా మూత్రం ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఇక బి విటమిన్లు ఎక్కువైతే మూత్రం గ్రీన్ కలర్‌లో వస్తుంది. అయితే ఈ విధంగా ఒకటి, రెండు సార్లు వస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ సార్లు వస్తుంటే మాత్రం డాక్టర్‌ను కలవాల్సిందే. అది ఏదైనా అనారోగ్య సమస్య అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక నిర్లక్ష్యం చేయరాదు.
3. ముదురు గోధుమ రంగులో మూత్రం వస్తుంటే అది కామెర్లు అయి ఉండవచ్చు. లేదా లివర్, మూత్రాశయం, క్లోమ గ్రంథి సమస్యలు కావచ్చు. అలాంటి సందర్భాల్లో మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంది. కనుక ఇలా వచ్చినా కూడా స్పందించాల్సిందే. కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్‌ను అధికంగా తాగినా, మద్యం ఎక్కువగా సేవించినా ఇలా మూత్రం డార్క్ బ్రౌన్ కలర్‌లో వస్తుంది.
4. మూత్రం స్పష్టంగా లేకుండా నలకల మాదిరిగా వస్తున్నా, మడ్డిగా ఉన్నా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇలా వస్తే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.
5. మూత్రం దుర్వాసనతో వస్తుంటే అందుకు పలు కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఎక్కువగా తింటున్నా లేదా మద్యం ఎక్కువగా సేవించినా, నీటిని సరిగ్గా తాగకపోయినా, డయాబెటిస్ సమస్య ఉన్నా, కిడ్నీ వ్యాధులు ఉన్నా.. మూత్రం డార్క్ కలర్‌లో దుర్వాసనతో వస్తుంది. అందువల్ల ఈ విధంగా మూత్రం వచ్చినా కూడా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.