Mahabharat : హిందూ పురాణాల్లో మహాభారతం కూడా ఒకటి. ఇందులో కేవలం పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కథ మాత్రమే కాకుండా మనకు జీవితంలో ఉపయోగపడే అనేక అంశాలు దాగి ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఈ క్రమంలోనే మనం మహాభారతం నుంచి మన నిత్య జీవితానికి అనేక అంశాలను ఆపాదించుకోవచ్చు. అయితే అన్నీ అవసరం లేదు కానీ మనం అలా మహాభారతం నుంచి అనుసరించాల్సిన 5 ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన జీవితాంతం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. నాకు చాలా తెలుసు, ఇంక చాలు, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకంతా తెలుసు, నేనేమీ ఇక నేర్చుకోవాల్సిన పనిలేదు, అని అనుకోకూడదు, ఎందుకంటే అర్జునుడు తన జీవితం మొత్తం ఏదో ఒక విద్యలో ప్రావీణ్యతను సంపాదిస్తూనే ఉన్నాడు. ఇదే మనకు ఆదర్శం. ఇక ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి. లేకపోతే అసలు దాని గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి సగమే తెలుసుకుని అందులోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కనుక ఏదైనా విషయంలో ఉంటే పూర్తి జ్ఞానం ఉండాలి. లేదంటే అసలు జ్ఞానం లేకపోవడమే మంచిది.
ఇక కర్ణుడు, దుర్యోధనుడి కథ విషయానికి వస్తే.. సహాయం చేయని స్నేహితులు 100 మంది ఉన్నా వృథాయే. సహాయం చేసే నమ్మకస్తుడైన స్నేహితుడు ఒక్కడు ఉన్నా చాలు. కర్ణుడు దుర్యోధనున్ని ఇలా చాలా సార్లు రక్షించాడు. ఇక ప్రతీకారం అనేది నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. అది శకుని విషయంలో రుజువు అవుతుంది. కౌరవులపై శకుని ప్రతీకారం తీర్చుకోవాలని వారితో స్నేహం చేసి చివరకు శకుని కూడా పాతాళంలోకి వెళ్లిపోయాడు. అందువల్ల ప్రతీకారం అనేది పనికిరాదు. ఇక ఏం చేసినా పక్కా ప్రణాళికతో చేయాలి. శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి యుద్ధ వ్యూహాలు రచించి అమలు చేయించాడు. కనుకనే వారికి సైన్యం తక్కువగా ఉన్నా విజయం సాధించగలిగారు. అందువల్ల ఏం పనిచేసినా పక్కా ప్లాన్‌తోనే చేయాలి. ఎలాంటి ప్లాన్ లేకుండా ఏం చేసినా విజయం సాధించలేరు.