ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఏదేని ఓ విషయం దాగి ఉంటే దాన్ని రహస్యం అంటారు, కానీ అదే విషయం ఇద్దరు కాకుండా ఇంకా అంతకు మించిన సంఖ్యలో ఇతరులకు తెలిస్తే దాన్ని రహస్యం అంటారా…? అనరు గాక అనరు. కొన్ని రహస్యాలనైతే కొంతమంది రెండో వ్యక్తికి కూడా తెలియకుండా జీవితాంతం తమలోనే దాచి పెట్టుకుంటారు. కానీ ఇంకొందరు అలా కాదు, ఏదైనా ఓ కొత్త రహస్యం తెలిస్తే చాలు, దాన్ని ఇతరులకు చెప్పడంలో ఎక్కడ లేని ఆసక్తిని ప్రదర్శిస్తారు. అయితే సాధారణంగా కేవలం ఆడవారికి మాత్రమే ఇలా రహస్యాలను బయటికి చెప్పే అలవాటు ఉంటుందట. మగవారికి ఉండదట. దీని గురించి మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం. మరి, ఇందులో వాస్తవం ఎంత ఉందో, అసలు ఈ విషయం ఇలా స్థిరంగా సమాజంలో పాతుకుపోవడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మహాభారతం గురించి మీకు తెలుసుగా. అందులో కుంతీ దేవి పుత్రులే పాండవులు. అయితే పాండవులను కనకముందు కుంతి సూర్య భగవానుడి అనుగ్రహంతో కర్ణున్ని కంటుంది. కానీ ఆమెకు అప్పటికి పెళ్లి కాకపోవడంతో ఆ విషయం నలుగురికీ తెలిస్తే ఇబ్బంది అవుతుందని గమనించిన ఆమె శిశువుగా ఉన్న కర్ణున్ని నదిలో విడిచి పెడుతుంది. అనంతరం కర్ణుడు వేరే వారి వద్ద పెరగడం, విద్యలు అభ్యసించడం, కౌరవుల చెంత చేరడం, పాండవులతో యుద్ధం అన్నీ అవుతాయి. ఆ యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు కూడా. అయితే కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన అనంతరం ధర్మరాజు ఆ యుద్ధంలో మృతి చెందిన తన కుటుంబ సభ్యులకు పిండ ప్రదానాలు చేసి, కర్మలు నిర్వహిస్తాడు.
కానీ కర్ణుడికి సంతానం కానీ, కుటుంబ సభ్యులు గానీ ఎవరూ లేకపోవడంతో అతనికి పిండ ప్రదానం చేసేవారు ఎవరూ ఉండరు. ఈ క్రమంలో కుంతి అది తలచుకుని దుఃఖిస్తుంది. అనంతరం ధర్మరాజు వద్దకు వచ్చి కర్ణుడు మీ అన్న అని, అతనికి శ్రాద్ధ కర్మలు చేయాలని చెబుతుంది. దీంతో ధర్మరాజు మొదట విలపించి అనంతరం ఆగ్రహిస్తాడు. అంతటి రహస్యాన్ని కడుపులో పెట్టి దాచుకున్నందుకు గాను ఇకపై ఆడవారు తమ మనస్సులో ఎలాంటి రహస్యాన్ని దాచుకోలేరని శాపం పెడతాడు. అందుకే అప్పటి నుంచి ఆడవారెవరైనా తమకు ఏదైనా రహస్యం తెలిస్తే వెంటనే చెప్పేయడం, దాన్ని ఇతరులకు చేరవేయడం వంటివి జరుగుతున్నాయి.
అయితే పైన చెప్పింది పురాణాల ప్రకారమే అయినా, దీనికి సంబంధించి ఓ బ్రిటిష్ పరిశోధన బృందం పలు పరిశోధనలు కూడా చేసింది. వారి పరిశోధనల్లో తెలిసిందేమిటంటే… ఏ మహిళ అయినా తనకు ఏదైనా రహస్యం తెలిస్తే దాన్ని 32 నిమిషాల కన్నా ఎక్కువ సేపు తనలో ఉంచుకోదని, వెంటనే దాన్ని ఇతరులకు చెప్పేస్తుందని తేలింది. అయితే మగవారు కాకుండా కేవలం ఆడవారే రహస్యాల విషయంలో ఎందుకు ఇలా చేస్తారనే దానిపై స్పష్టత లేదట. కొందరు మహిళలు రహస్యాలను తెలుసుకోవాలనే ఉత్సాహంతో వాటిని చెప్పేస్తుంటే, కొందరు ఇతరులకు తెలియని రహస్యాలు తమకే తెలిశాయన్న గొప్ప ఫీలింగ్ కలగడం కోసం రహస్యాలను వెంటనే చెప్పేస్తున్నారట.
ఇంకొందరికైతే రహస్యాలను ఎక్కువ రోజుల పాటు దాచి పెట్టి ఉంచితే వారిలో మానసిక ఒత్తిడి తీవ్రతరమై అది భరించలేక రహస్యాలను చెప్పేస్తున్నారట. ఇక రహస్యాలను చెప్పడం విషయంలో పురుషుల దాకా వస్తే వారు కూడా రహస్యాలను చెప్పే సందర్భాలు కొన్ని ఉన్నాయట. అవేమిటంటే, రిలాక్స్‌గా ఉన్నప్పుడు, మద్యం సేవించినప్పుడు. ఆ రెండు సందర్భాల్లోనూ వారు కూడా రహస్యాలను చెప్పేస్తారట. ఏది ఏమైనా రహస్యాలను చెప్పడం విషయంలో పై అంశాలు కొంత ఆసక్తికరంగా, తెలుసుకునే విధంగానే ఉన్నాయి కదూ..!