మన హిందూ మతం ఎంతో గొప్పది. ఇందులో చాలా రకాలకు సంబంధించిన విషయాలు.. ముందే చెప్పారు. భవిష్యత్తులో ఏం అవుతుంది.. అలాగే.. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ముందే చెప్పారు. ఇందులో భాగమే గరుడ పురాణం. గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు. అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికీ ఇది ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది. దీన్ని వేద వ్యాసుడు రచించాడు.అయితే ఈ గరుడపురాణం ప్రకారం.. నరకంలో ఎలాంటి పాపం చేసే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం సేవించే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి చేత ద్రవరూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తారట. ఆడ, మగ ఎవరైనా ఒకరు ఇంకొకరిని లైంగికంగా వేధించిన, అత్యాచారం చేసిన నరకంలో వారి జనన అవయవాలను కత్తిరిస్తారు. జంతువులను చంపే వారికి కూడా నరకంలో శిక్షలు పడతాయి. వారిని జంతువులను నరికినట్టే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతారట. పేదలకు అన్నం పెట్టకుండా తామే తినే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది. వారి శరీరాన్ని పక్షులకు ఆహారంగా వేస్తారు. తమ సంతోషం కోసం జంతువులను హింసిస్తూ వేడుక చూసేవారికి, అలా వాటిని చంపే వారికి నరకంలో శిక్ష పడుతుంది. వారిని సలసల కాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తారట.
పెద్దలకు గౌరవం ఇవ్వని వారికి, వారిని నిర్లక్ష్యం చేసే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది.వారిని బాగా వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచుతారు. ఆ బాధను తట్టుకోకున్నా సరే అందులో ఉండాల్సిందే. ఇతరులకు సహాయం చేయని వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారిని ఎత్తైన లోయ లోంచి కిందకు విసిరేస్తారు. అక్కడ ప్రమాదకరమైన పాములు, తేళ్లు వంటి విషపురుగులతో కుట్టిస్తారు. ఆ తరువాత క్రూర జంతువులతో హింసిస్తారు. ఎప్పుడూ ఇతరులను మోసం చేసేవారిని, అబద్ధాలు ఆడేవారిని, తిట్టేవారిని నరకంలో శిక్షిస్తారు.
వారిని అక్కడ తలకిందులుగా వేలాడదీసి క్రూరమైన జంతువుల చేత హింసింపజేస్తారు. ప్రజలను సరిగ్గా పాలించకుండా, వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నరకంలో దారుణమైన శిక్ష వేస్తారు. వారి శరీరాలను పిప్పి పిప్పి చేస్తారు. అంతకుముందు దారుణంగా కొడతారు. ఆ తరువాత శరీరాలను రోడ్డు రోలర్ కింద వేసి నలిపినట్టు నలిపేస్తారు. ప్రజల ధనం, వస్తువులు దోపిడీ చేసే వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందంటే వారిని యమభటులు తాళ్లతో దారుణంగా కట్టేసి రక్తం వచ్చే వరకు కొడతారు. రక్తాలు కారుతున్నప్పటికీ కొట్టడం ఆపరు. వారు పడిపోయే వరకు అలా కొడుతూనే ఉంటారు.