Allam Charu : వాతావరణం మారినప్పుడల్లా మనలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు వేడి వేడిగా అల్లం చారును తయారు చేసుకుని అన్నంతో తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ చారుతో భోజనం చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గు ముఖం పడతాయి. ఈ అల్లం చారును తయారు చేయడం చాలా సులభం. వేడి వేడిగా కమ్మగా ఉండే ఈ అల్లం చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, టమాటాలు – 2, అల్లం – 3 ఇంచులు, వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండుమిర్చి – 2, ధనియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
అల్లం చారు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నానబెట్టిన చింతపండును తీసుకోవాలి. తరువాత ఇందులో టమాటాలు వేసి చేత్తో రసం వచ్చేలా బాగా నలపాలి. తరువాత వీటి నుండి రసాన్నితీసుకోవాలి. తరువాత మిగిలిన పిప్పిలో మరికొద్దిగా నీళ్లు పోసి రసాన్ని తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో శుభ్రం చేసిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న అల్లం మిశ్రమం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు, టమాట రసం వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తరువాత కారం వేసి ఈ చారును మధ్యస్థ మంటపై 3 పొంగులు వచ్చే వరకు మరిగించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం చారు తయారవుతుంది. దీనినివేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అల్లం చారును తయారు చేసుకుని మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.