Aloo Dum Biryani : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. కూరలే కాకుండా ఈ బంగాళాదుంపలతో మనం ఎంతో రుచిగా ఉండే ఆలూ ధమ్ బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. ఆలూ ధమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసేవారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆలూ ధమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ధమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, పెరుగు – 100 గ్రా., ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా దినుసులు..
దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, జాపత్రి – 1, లవంగాలు – 6, యాలకులు – 5, సాజీరా – ఒక టీ స్పూన్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – అర కిలో, నీళ్లు – ఒక లీటర్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 3, ఉప్పు – కొద్దిగా.
ఆలూ ధమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేడి నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఈ ముక్కలను వడకట్టుకుని అడుగు మందంగా ఉండే కళాయిలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మసాలా దినుసులు, బిర్యానీ తయారీకి కావల్సిన మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో ఒక లీటర్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులో బియ్యం తప్ప మిగిలిన పదార్థాలు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత అందులో బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 50 శాతం వరకు ఉడికించి వడకట్టుకోవాలి. ఇలా ఉడికించిన అన్నాన్ని ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంపలపై సమానంగా వేసుకోవాలి.
తరువాత అన్నంపై కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్, 100 ఎమ్ ఎల్ నీళ్లు చల్లుకుని ఆవిరి పోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు పెద్ద మంటపై, 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ధమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతా, మసాలా కర్రీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలతో పాటు వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ధమ్ బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు.