Aloo Methi Masala Curry : మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మెంతి కూరను తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వంటల్లో వాడడంతో పాటు మెంతికూరతో కూడా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మెంతి కూరతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అందులో భాగంగా మెంతి కూరతో మనం ఆలూ మేతి మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మేతి మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతి ఆకు – పావు కిలో, బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, టమాట – మధ్యస్థంగా ఉన్నది ఒకటి, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ప్రెష్ క్రీమ్ – 3 టేబుల్ స్పూన్స్,నీళ్లు – అర కప్పు.
ఆలూ మేతి మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా మెంతి ఆకులను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాటను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలను మెత్తగా మగ్గించాలి.
బంగాళాదుంప ముక్కలు మగ్గిన తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మెంతి ఆకు వేసి కలపాలి. దీనిని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించిన తరువాత ఫ్రెష్ క్రీమ్, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మేతి మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.