Aloo Pakoda : మనం బంగాళాదుంపలతో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో సులభంగా చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఆలూ పకోడా కూడా ఒకటి. ఆలూ పకోడా క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. టమాట కిచప్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ పకోడాలను తయారు చేయడం చాలా తేలిక. క్రిస్పీగా రుచిగా ఉండే ఈ ఆలూ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ పకోడా తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి వాటిని సన్నగా తురుముకోవాలి. తరువాత ఈ బంగాళాదుంప తురుమును నీటిలో వేసి కడగాలి. తరువాత ఈ తురుమును చేత్తో గట్టిగా పిండి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. నీళ్లు వేయకుండా ఈ పిండిని కలుపుకోవాలి. అవసరమైతే మరికొద్దిగా శనగపిండిని వేసుకోవాలి. ఇలా పకోడి మిశ్రమాన్ని కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవచ్చు. లేదంటే ఈ మిశ్రమాన్ని వడ లాగా వత్తుకుని కూడా నూనెలో వేసుకోవాలి. వీటిని నూనెలో వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పకోడాలు తయారవుతాయి. వీటిని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.