Aloo Pepper Fry : బంగాళాదుంపలతో చేసే వంటకాల్లో బంగాళాదుంప ప్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. తరుచూ చేసే ఈ బంగాళాదుంప ప్రైను మనం మిరియాలు వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో పాటు సైడ్ డిష్ గా కూడా దీనిని తినవచ్చు. మరింత రుచిగా, అందరికి నచ్చేలా ఆలూ పెప్పర్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పెప్పర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, మిరియాలు -ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6 నుండి 8, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, బంగాళాదుంప ముక్కలు – 300 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, మ్యాగీ మ్యాజిక్ మసాలా – ఒక ప్యాకెట్, తరిగిన పచ్చిమిర్చి- 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ పెప్పర్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా రోట్లో మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత దంచిన మిరియాలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలు,ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలోకలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మూత తీసి బంగాళాదుంప ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మ్యాగీ మ్యాజిక్ మసాలా, పచ్చిమిర్చి, మరికొద్దిగా కరివేపాకు వేసికలపాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పెప్పర్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.