Aloo Pepper Fry : బంగాళాదుంపలతో కూడా మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో ఎక్కువగా చేసే వంటలల్లో బంగాళాదుంప ఫ్రై ఒకటి. దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప వేపుడులో మిరియాలు వేసి మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. మిరియాలు వేసి చేసే ఈ బంగాళాదుంప వేపుడును తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంప వేపుడును మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెప్పర్ పొటాటో ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కలు – 300 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెప్పర్ పొటాటో ఫ్రై తయారీ విధానం..
ముందుగా రోట్లో మిరియాలను, వెల్లుల్లి రెబ్బలను వేసి కచ్చా పచ్చాగా దంచుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల మిశ్రమాన్ని వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకు వేసి వేయించాలి.ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూతను ఉంచి బంగాళాదుంప ముక్కలు మెత్తబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి. తరువాత మూత తీసి వీటిని రంగు మారే వరకు కలుపుతూ బాగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కొత్తిమీరను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెప్పర్ పొటాటో ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, పప్పు, రసం, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బంగాళాదుంప వేపుడుకు కంటే ఇలా మిరియాలు వేసి చేసిన బంగాళాదుంప వేపుడు మరింత రుచిగా ఉంటుంది.