Aloo Sandwich : బ్రెడ్ తో చేసుకోదగిన వాటిల్లో సాండ్విచ్ కూడా ఒకటి. సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనం వివిధ రకాల సాండ్విచ్ లను ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన సాండ్విచ్ లలో ఆలూ సాండ్విచ్ కూడా ఒకటి. ఈ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్స్ గా దీనిని తయారు చేసుకుని తినవచ్చు. అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ సాండ్విచ్ ను పెట్టవచ్చు. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ సాండ్విచ్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ సాండ్విచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, ఉల్లిపాయ తరుగు – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, సాండ్విచ్ బ్రెడ్ – 4, టమాట కిచప్ – ఒక టీ స్పూన్, మయనీస్ – ఒక టేబుల్ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్.
ఆలూ సాండ్విచ్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను మెత్తగా చేసుకుని తడి పోయేలా ఆరబెట్టుకోవాలి. తరువాత ఇందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, చిల్లీ ప్లేక్స్ వేసి బాగా కలపాలి.తరువాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని దానికి టమాట కిచప్ ను రాయాలి. తరువాత దీనిపై బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మరో బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానికి మయనీస్ ను రాసి ఆలూ మిశ్రమంపై ఉంచి ఊడిపోకుండా నెమ్మదిగా వత్తాలి. ఇప్పుడు కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత సాడ్వించ్ ను ఉంచి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.తరువాత దీనిని క్రాస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ సాండ్విచ్ తయారవుతుంది. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు.