Aloo Vankaya Curry : మనం బంగాళాదుంపలతో ఇతర కూరగాయలను కూడా కలిపి వండుతూ ఉంటాము. ఇలా చేసుకోదగిన కూరల్లలో ఆలూ వంకాయ కూర కూడా ఒకటి. వంకాయలు, బంగాళాదుంప కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు చేసుకోవడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఈ కూరను చాలా తేలికగా తయారు చేయవచ్చు. అంతేకాకుండా ఈ కూరను తినడం వల్ల వంకాయలు, బంగాళాదుంప వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రుచిగా, సులభంగా, చాలా తక్కువ సమయంలో ఆలూ వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంప – పెద్దది ఒకటి, తరిగిన వంకాయలు – పావుకిలో, తరిగిన పచ్చిమిర్చి – 6, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, నూనె- 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కసూరి మెంతి -అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్.
ఆలూ వంకాయ కూర తయారీ విధానం..
దీని కోసం ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట, బంగాళాదుంప, వంకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కారం, ఉప్పు, గరం మసాలా, కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలపాలి.
దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. .కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు.