Andhra Style Mutton Liver Fry : మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే నాన్ వెజ్ వంటకాల్లో మటన్ లివర్ ఫ్రై కూడా ఒకటి. ఈ మటన్ లివర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి. చాలా మంది మటన్ లివర్ ఫ్రైను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే దీనిని కేవలం 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను అందించే ఈ మటన్ లివర్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ లివర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ లివర్ – అరకిలో, లవంగాలు – 8, వెల్లుల్లి పాయ – చిన్నది ఒకటి, అల్లం – ఒక ఇంచు ముక్క, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్క – 2 ఇంచుల ముక్క, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ లివర్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా మటన్ లివర్ ను ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత కళాయిలో ధనియాలు, లవంగాలు వేసి దోరగా వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లివర్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. ఇలా 10 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, కారం వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ లివర్ ఫ్రై తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మటన్ లివర్ తో ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.