Andhra Style Sorakaya Pulusu : సొరకాయ పులుసు.. సొరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. సొరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, ఆమ్లెట్ తో తింటే ఈ పులుసు మరింత రుచిగా ఉంటుంది. సొరకాయ పులుసును తయారు చేయడం చాలా తేలిక. ఇంట్లో సొరకాయ ఉంటే చాలు చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ పులుసును తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా స్టైల్ సొరకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, మెంతులు – 2 చిటికెలు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 4, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, సొరకాయ ముక్కలు – ఒక కప్పు లేదా ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – అర గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆంధ్రా స్టైల్ సొరకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత సొరకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి. తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆంధ్రా స్టైల్ సొరకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన సొరకాయ పులుసును అదరూ ఎంతో ఇష్టంగా తింటారు.